అవిశ్వాస ఆయుధం..

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలపై అవిశ్వాసం రాజ్యాంగం ఇచ్చిన ఆయుధం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా.....ఆశలు నెరవేర్చని ప్రభుత్వాలపై సంధించే ఓ అస్త్రం. ఏలికలు సక్రమంగా పాలన చేయడం లేదని భావించిన పార్టీలు అధికారంలో ఉన్న పార్టీని గద్దె దించడమే అవిశ్వాస తీర్మానం. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా అంశంపై, అధికార బిజేపిపై,  ప్రధాని నరేంద్ర మోదీ పాలనపై బుధవారం నాడు అవిశ్వాస అస్త్రాన్ని తెలుగుదేశం పార్టీ ప్రయోగించింది. తొలుత ఈ తీర్మానంపై చర్చకు పదిరోజులు గడువు కావాలన్న లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ శుక్రవారం నాడే చర్చకు అనుమతించారు. ఈ పరిణామం బిజేపి రాజకీయ ఎత్తుగడో, మరొకటో తేలాల్సుంది. శుక్రవారం నాటి అవిశ్వాసానికి వ్యతిరేకంగా బిజేపికి ఉన్న బలం 312 మంది. ఇక మోదీ ప్రభుత్వం పై తమకు విశ్వాసం లేదంటున్న వారు 141 మంది. అటూ, ఇటూ కాకుండా అవిశ్వాసంపై ఏటూ తేల్చని సంఖ్య 80.

 

 

తెలుగుదేశం ఎంపీలు కేశినేని నాని, తోట నర్సింహం, కొనకళ్ల లోక్‌సభలో ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇంతకు ముందు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానం కనీసం అమోదానికి కూడా రాకుండా సభలో గందరగోళం జరిగింది. ఆ సమయంలో బిజేపి వ్యూహాత్మకంగా తమిళనాడు ఎంపీలతో కావేరి సమస్యపై సభను అడ్డుకునేలా చేసింది. ఈసారి మాత్రం చర్చకు అనుమతి వచ్చేలా చేసారు. దీని వెనుక బిజేపి వ్యూహమేమిటో తర్వాత తెలియాలి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి తాజా అవిశ్వాసంతో కలిపి 27 సార్లు ప్రతిపక్షాలు ఈ అవిశ్వాస తీర్మాన ఆయుధాన్నిప్రయోగించారు. భారత్-చైనా యుద్ధం తర్వాత దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు ప్రభుత్వం పై ఆచార్య క్రుపాలానీ తొలిసారిగా 1963లో అవిశ్వాస తీర్మానం పెట్టారు.  

 

 

ఆ తర్వాత 1967 లో అప్పటి ప్రధాని ఇందిర గాంధీపై భాజపా నేటి సీనియర్ నేత వాజ్‌పాయ్ తొలిసారిగా అవిశ్వాస తీర్మానం పెట్టారు. దేశంలో  ఎక్కువ సార్లు అవిశ్వాస తీర్మానం ఎదుర్కొన్న ప్రధాని ఇందిరా గాంధీయే. తన హయాంలో ఇందిర 15 సార్లు అవిశ్వాసాన్ని ఎదుర్కొన్నారు. ఆమె తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి, పి.వి. నరసింహారావులు మూడేసి సార్లు అవిశ్వాసం పాలయ్యారు.

 

 

అవిశ్వాసం పై చర్చ పూర్తి కాకుండానే తన పదవికి రాజీనామ చేసింది  మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ మాత్రమే. 1979 లో జరిగిన ఈ చర్య  మొరార్జీ దేశాయ్ నైతికతకు అద్దం పడుతుంది. ఇక రాజీవ్ గాంధీ, వాజ్‌పాయ్,  ప్రస్తుత ప్రధాని మోదీ అవిశ్వాస ఆయుధాన్ని ఒక్కోసారే ఎదుర్కున్నారు.శుక్రవారం జరిగే అవిశ్వాస తీర్మాన చర్చలో పాల్గొనాలని లోక్‌సభకు విధిగా హాజరుకావాలని బిజేపి, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు తమ సభ్యులకు విప్ జారీ చేసాయి.

 

 

అవిశ్వాసంపై చర్చ సంధర్భంగా ఆంధ్రప్రదేశ్ కు ఏమిచ్చామో చెప్పేందుకు బిజేపి లెక్కలు తీస్తోంది. అలాగే ఇంతవరకూ ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన నిధులు, రావాల్సిన బాకాయిలపై రాజధాని అమరావతిలో అధికారులు లెక్కలు తీస్తున్నారు. మొత్తానికి ఈ అవిశ్వాసం ఓ చరిత్రకానుంది.   నిరంతరం సంచలన వ్యాఖ్యాలతో వార్తల్లో ఉండే తెలుగుదేశం లోక్‌సభ సభ్యుడు జే.సి. దివాకర్ రెడ్డి ఈ అవిశ్వాస తీర్మానానికి దూరంగా ఉంటాననడం  కొసమెరుపు.