లోక్‌సభ వాయిదా.. మోడీ ఎస్కేప్ అయ్యారోచ్..!!

ఏపీకి న్యాయం చేయాలని.. ఆంధ్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని ఏపీ ఎంపీలు చేస్తోన్న నిరసనలతో కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఆందోళన విరమించాలని స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ విజ్ఞప్తి చేసినప్పటికి వినిపించుకునే పరిస్థితి లేదు. సస్పెండ్ అయినా సరే పార్లమెంట్ గేట్ దగ్గర నిరసనను కొనసాగించాలని చంద్రబాబు.. తన ఎంపీలకు చెప్పడంతో వారు ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఏం చేయాలో పాలుపోక.. సభను ఎలా నడిపించాలో అర్థంకాక నరేంద్రమోడీ కొత్త ఎత్తు వేశారు.

 

ఇవాళ సాయంత్రం వరకు జరగాల్సిన పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేశారు. ఉదయం సభ ప్రారంభమైన కొద్దిసేపటికే.. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని టీడీపీ, వైసీపీ ఎంపీలు ఫ్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు.. సభా వ్యవహారాలకు ఆటంకం కలగడంతో.. ఐదు నిమిషాల్లోనే సభను మధ్యాహ్నానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. ఆ తర్వాత కూడా పరిస్థితిలో ఏ మార్పు లేకపోవడంతో లోక్‌సభను నిరవధిక వాయిదా వేయాలని స్పీకర్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. మళ్లీ లోక్‌సభ సమావేశాలు మార్చి 5న మొదలవుతాయి. ఈ నిర్ణయం ద్వారా ఇప్పటి వరకు పార్లమెంట్ వేదికగా సాగుతున్న నిరసన కార్యక్రమం.. జంతర్‌మంతర్ లేదా మరో వేదికకు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.