ఎన్డీఏలో చిరాగ్ చిచ్చు.. బీహార్ రాజకీయాల్లో అలజడి
Published on: Tue Jun 15, 2021 2:08PM
బీహార్ రాజకీయాలు మరోమారు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. పతాక శీర్షికలకు చేరుకున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్డీఎ కూటమిలో రెండవ కుంపటి రాజేసిన, కేంద్ర మాజీ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ తనయుడు చిరాగ్ పాశ్వాన్ ఇప్పుడు అందుకు మూల్యం చెల్లిస్తున్నారు. పాశ్వాన్ మరణం తర్వాత ప్రాంతీయ, కుటుంబ పార్టీల ధర్మాన్ని పాటిస్తూ, ఆయన కుమారడు చిరాగ్ లోక్’జనశక్తి (ఎల్ జీపీ) పార్టీ పగ్గాలు చేపట్టారు. అయితే, జాతీయ స్థాయిలో ఎన్డీఎలో కొనసాగుతూనే,బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం, ద్విముఖ పంధాను ఎంచుకున్నారు. బీజేపీతో దోస్తీ కొనసాగించారు.ఆ పార్టీ పోటీచేసిన అన్ని స్థానాల్లో కమల దళానికి మద్దతు ఇచ్చారు.అదే సమయంలో, ఎన్డీఎ మరో కీలక భాగస్వామ్య పక్షం, ముఖ్యమంత్రి నితీష్ కుమార సారధ్యంలోని జేడీ(యు)ను దూరం పెట్టారు. జేడీ (యు) అభ్యర్ధులు పోటీ చేసిన అన్ని స్థానాల్లో తమ పార్టీ అభ్యర్ధులను నిలిపారు. ఫలితంగా, రాష్ట్రంలో బీజేపీ 74 సీట్లతో అతి పెద్ద పార్టీగా అవతరించింది. జేడీ(యు) 43 స్థానాల్లో మాత్రమే విజయం సాధించగలిగింది. మరో వంక, ఆర్జేడీ సారధ్యంలోని మహా ఘటబంధన్ ‘కూడా 110 స్థానాలు గెలుచుకుంది.
అప్పటి నుంచి చిరాగ్ పాశ్వాన్, నితీష్ కుమార్ మధ్య దూరం మరింతగా పెరిగింది.ఇద్దరి మధ్య కుల మంటలు రగులుతూనే ఉన్నాయి. చిరాగ్’ ను దెబ్బతీసేందుకు నితీష్ ఈ చిన్న అవకాశాన్ని వదులుకోలేదు. ఒక విధంగా చెప్పాలంటే, బీజేపీ దయదక్షిన్యాల మీద ఆధారపడి ముఖ్యమంత్రిగ కొనసాగుతునందుకు, లోలోపల అవమాన భారంగా కృంగి, రగిలి పోతున్న నితీష్ కుమార్, ‘అవమానమును సహింతునా’ టైపులో రగిలి పోయారు. వ్యూహాత్మకంగా పావులు కదిపారు. ఎల్జీపీలో దిగ్విజయంగా చీలిక తెచ్చారు. పార్టీ ఎంపీలు ఆరుగురిలో ఐదుగురు , తిరుగుబాటు బావుటా ఎగరేసారు. చిరాగ్ సొంత బాబాయి, పశుపతి కుమార్ పరాస్’ను తమ నాయకునిగా ఎన్నుకున్నారు. చిరాగ్’ను ఒంటరిని చేశారు. అంతే కాదు, ఆ ఐదుగురు ఇలా గీతదాటారో లేదో అలా, నితీష్ కుమార్ కీర్తనలు మొదలు పెట్టారు. నితీష్ కుమార్’ ను వికాస్ పురుష’ గా పేర్కొన్నారు. దీంతో, ఈ ఐదుగురు ఎంపీలు అడుగులు ఎటు పడుతున్నాయో చెప్పకనే చెప్పారు.
అప్పట్లో చిరాగ్ పాశ్వాన్, తీసుకున్న నిర్ణయాన్ని బీజీపీ ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా సమర్ధించింది. అయితే ఇపుడు ఎల్జీపీ చీలిక వచ్చిన నేపధ్యంలో బీజేపీ ఎలాంటి స్టాండ్ తీసుకుంటుంది అనేది, ఆసక్తికరంగా మారింది. కాగా చీలిక వర్గం నాయకుడు పరాస్, పార్టీ కార్యకర్తలు, నాయకులు అంతా తమ వెంటే ఉన్నారని, చిరాగ్ పాశ్వాన్ తీసుకున్న నితీష్ కుమార్ వ్యతిరేక స్టాండ్’ను వ్యతిరేకిస్తున్నారని అంటున్నారు. అయితే, ఆయన కూడా తమ వర్గం ఎన్డీఎ లో కొనసాగుతుందని స్పష్టంచేశారు.
నిజానికి ఎల్జీపీలో వచ్చిన చీలిక వలన ఇప్పటి కిప్పుడు,రాష్ట్రంలో లేదా కేంద్రంలో తీవ్రపరిణామాలు చోటు చేసుకునే అవకాశం లేదు. అయితే, కేంద్రంలో మంత్రి పదవిని ఆశిస్తున్న చిరాగ్ పాశ్వాన్’కు ఆశాభంగం తప్పక పోవచ్చని రాజకీయ వర్గాలు బావిస్తున్నాయి. అదలా ఉంటే, ఎల్జీపీ చీలిక వలన, ఇంతకాలం ఒకవిధమైన ఆత్మన్యూనతా బావంతో,గిల్టీగా ఫీల్ అవుతున్న నితీష్ కుమార్’కు కొంత ఊరట అయితే దొరుకుతుంది. అలాగే, భవిష్యత్ రాజకీయ సమీకరణలకు కూడా మారే అవకాశం ఉందని అంటున్నారు. మరో వంక అడిగినన్ని బెర్తులు ఇవ్వలేదని,అలిగి కేంద్ర కేంద్ర మంత్రివర్గంలో చేరెందుకు నిరాకరించిన నితీష్ కుమార్,ఇప్పుడు పెరిగిన బార్గైనింగ్ పవర్’తో కేంద్ర మంత్రి వర్గంలో చేరే అవకాశం కూడా ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అయితే, బీజేపీ, జేడీయు సంబంధాలు కూడా అనంతంత మాత్రంగానే ఉన్న నేపధ్యంలో ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయో చూడవలసి ఉందని, పరిశీలకులు భావిస్తున్నారు.


