తెలంగాణ వైపు దూసుకొస్తున్న మిడతల దండు.. పొంచి ఉన్న భారీ ముప్పు

ఓ వైపు కరోనా వైరస్‌ తో పోరాడుతోన్న భారత్ కి మరో కష్టం వచ్చిపడింది. పాకిస్థాన్‌ నుంచి వచ్చిన మిడతల దండు భారత్‌లోని పంట పొలాలను నాశనం చేస్తోంది. ఆ మిడతల దండు చాలా ప్రమాదకరమైంది. మిడతల దండు పొలంలో పడిందంటే ఇక ఆ పొలంలో ఏదీ మిగలదు. కొన్ని గంటల్లోనే పంటనంతా శుభ్రంగా ఆరగించేస్తాయి. లక్షలాది మిడతల దండు.. 30-40 వేలమందికి సరిపోయే ఆహారాన్ని ఒక్కరోజులో తినేస్తాయి. దీన్నిబట్టే అర్థంచేసుకోవచ్చు అవి ఎంత ప్రమాదకరమైనవో.

పాకిస్థాన్ నుంచి భారత్ కి దూసుకొచ్చిన లక్షలాది మిడతల దండు, లక్షలాది ఎకరాల్లో పంటలను నాశనం చేస్తున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాలపై వీటి ప్రభావం విపరీతంగా ఉంది. అయితే ఈ మిడతల ముప్పు తెలంగాణకూ పొంచి ఉంది. మిడతల దండు తెలంగాణ సమీపానికి రావడంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ అప్రమత్తమైంది. ఈ రాకాసి మిడతల దండు రాజస్థాన్ మీదుగా ఇప్పటికే మహారాష్ట్రలోకి ప్రవేశించింది. అక్కడి అధికారులు వీటిని పారద్రోలేందుకు నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. ఒకవేళ, వాటి నియంత్రణ సాధ్యం కాకుంటే, అవి తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉంది. దీంతో అప్రమత్తమైన వ్యవసాయశాఖ కార్యదర్శి బి. జనార్దన్‌రెడ్డి, నిపుణులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. సరిహద్దు జిల్లాల్లో రసాయనాలతో సిద్ధంగా ఉండాలని ఆయన ఆదేశించారు. జిల్లా, గ్రామ స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు సూచించారు.

ఈ మిడతల దండు గంటకు 12-15 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుందని, ఇవి చెట్ల మీద ఆవాసం ఏర్పరుచుకొని పంటలకు భారీ నష్టం కలిగిస్తున్నాయని జనార్దన్ రెడ్డి వెల్లడించారు. మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, నిజామాబాద్, భూపాలపల్లి, నిర్మల్, కామారెడ్డి జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ప్రతి గ్రామంలో రసాయనాలను సిద్ధం చేసుకోవాలని, ఈ విషయంలో రైతుల్లో అవగాహన పెంచి, చైతన్యవంతం చేయాలని అన్నారు.

మరోవైపు, జూన్ లోగా దేశంలోకి వచ్చిన మిడతల సంఖ్య 400 రెట్ల వరకూ పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా, భారీ ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రస్తుతం కరోనా మీద పోరాడోతోన్న ప్రభుత్వాలు.. ఇప్పుడు మిడతల దండుపై కూడా పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నాయి.