సొంతూళ్లకు కూలీలు.. లాక్‌డౌన్ భయాలు..

కరోనా కమ్మేస్తోంది. రాష్ట్రాలు లాక్‌డౌన్ దిశగా అడుగులేస్తున్నాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పంజాబ్, కర్ణాటక.. ఇలా అనేక చోట్ల రాత్రి కర్ఫ్యూ. పలుచోట్ల వీకెండ్ లాక్‌డౌన్. దీంతో, కూలీలకు కష్టాలు. ఉపాధికి ఇబ్బందులు. గతంలో మాదిరే దేశవ్యాప్తంగా మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారని కూలీల్లో భయాందోళనలు మొదలయ్యాయి. నైట్ కర్ఫ్యూతో కొన్ని కంపెనీల్లో ఉత్పత్తి తగ్గిపోగా కార్మికులు రోడ్డున పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సొంతూళ్లకు తిరిగి వెళ్లడమే మంచిదని భావిస్తున్నారు. అందుకే, ఢిల్లీ నుంచి పెద్ద సంఖ్యలో వలస కూలీలు స్వగ్రామాలకు తరలిపోతున్నారు. వలస కూలీలతో రైళ్లు, లారీలు నిండుతున్నాయి. 

మళ్లీ లాక్‌డౌన్ పెడతారనే భయం వారి కళ్లల్లో, మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. గత లాక్‌డౌన్ సమయంలో వాళ్లు పడిన కష్టాలు, రవాణా సదుపాయం లేక వందల కిలోమీటర్లు కాలి నడకన నడిచిన ఇబ్బందులు వారిని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. అందుకే, నైట్ కర్ఫ్యూ అనగానే తట్టాబుట్టా, పెట్టాబేడా సర్దేసుకుంటున్నారు. కనిపించిన వాహనం ఎక్కేసి.. అడిగిన కాడికి ఇచ్చేసి.. బతుకు జీవుడా అంటూ సొంతూళ్లకు ప్రయాణమవుతున్నారు.

వలస కూలీలతో కరోనా ముప్పు..
మహారాష్ట్రపై కరోనా పంజా విసిరింది. ప్రస్తుతం దేశంలో నమోదవుతున్న కేసుల్లో సగానికి పైగా మహారాష్ట్ర నుంచే ఉంటున్నాయి. కొవిడ్ భయం అక్కడి వారిని వణికిస్తోంది. మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలకు తెలంగాణ ఊళ్లతో సంబంధాలు ఉండటంతో అక్కడి వారంతా ఇక్కడికి తరలివస్తున్నారు. ఇక, ఉపాధి కోసం ముంబై, పుణే, బీవండి, గుజరాత్‌లోని సూరత్, అహ్మదాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లిన వలస కూలీలు సైతం తెలంగాణకు తిరిగి వస్తున్నారు. వస్తూ వస్తూ వారితో పాటు కరోనా వైరస్‌ను మోసుకొస్తున్నారు. ఎలాంటి పరీక్షలు లేకుండానే వాళ్లంతా సొంతూళ్లకు రావడంతో నిర్మల్, ఆదిలాబాద్ తరితర జిల్లాల్లో కొవిడ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ విషయం హైకోర్టు సైతం గుర్తించింది. మహారాష్ఠ్ర నుంచి వచ్చే వారికి ఎలాంటి టెస్టులు చేస్తున్నారంటూ సర్కారును ప్రశ్నించింది. అటు, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సైతం మహారాష్ట్ర నుంచి వచ్చే వారి వల్ల కేసులు ఎక్కువ అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 

సెకండ్ వేవ్, నైట్ కర్ఫ్యూ కారణంగా వలస కూలీలంతా సొంతూళ్లకు ప్రయాణమవుతూ వైరస్‌ను వ్యాపింపజేస్తున్నారని అంటున్నారు. ప్రభుత్వం తరఫున సరైన విధానం లేకపోవడం.. కూలీల రాకపై పక్కా సమాచారం లేకపోవడం.. కొవిడ్ విజృంభణకు కారణం అవుతోంది. మళ్లీ లాక్‌డౌన్ పెడతారో లేదో తెలీదు కానీ.. లాక్‌డౌన్ భయాలు మాత్రం అటు కూలీలకు, ఇటు ప్రజలను వెంటాడుతూనే ఉంది.