కేంద్రం ప్రకటన తర్వాతే తెలంగాణాలో వ్యూహం ఖ‌రారు చేస్తాంః కేసీఆర్

ఈ నెల 17తో ముగుస్తున్న దేశ వ్యాప్త లాక్ డౌన్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మార్గదర్శకాలను పరిశీలించి, రాష్ట్రంలో అనుసరించే వ్యూహం ఖరారు చేస్తామని సిఎం తెలిపారు. హైదరాబాద్ నగరంలోని నాలుగు జోన్లలో తప్ప, రాష్ట్రంలో ప్రస్తుతం మరెక్కడా కరోనా యాక్టివ్ కేసులు లేవని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. 

కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు కొనసాగిస్తూనే, వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు రాకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యలు, లాక్ డౌన్ అమలు, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తదితర అంశాలపై సీఎం కేసీఆర్ శుక్రవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. 

''తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ హైదరాబాద్ నగరంలోని కేవలం నాలుగు జోన్లకే పరిమితం అయింది. ఎల్.బి.నగర్, మలక్ పేట, చార్మినార్, కార్వాన్ జోన్లలోనే ప్రస్తుతం యాక్టివ్ కేసులున్నాయి. ఈ జోన్లలో 1442 కుటుంబాలున్నాయి. 

యాదాద్రి భువనగిరి, జనగామ, మంచిర్యాల జిల్లాలకు చెందిన వలస కూలీలకు కొందరికి వైరస్ సోకినట్లు తేలింది తప్ప, ఆ జిల్లా వాసులకు ఎవరికీ పాజిటివ్ లేదు. ఆ వలస కూలీలు కూడా హైదరాబాద్ లోనే ట్రీట్మెంట్ అందిస్తున్నాం. కాబట్టి ఆ మూడు జిల్లాల్లో పాజిటివ్ కేసులు ఉన్నట్లు పరిగణించడానికి లేదు. పాజిటివ్ కేసులున్న నాలుగు కంటైన్మెంట్ జోన్లలో లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నాం. లక్షణాలున్న వారికి పరీక్షలు నిర్వహించి, చికిత్స చేస్తున్నాం'' అని సీఎం కేసీఆర్ వెల్లడించారు.