ఉస్మానియా హాస్పిటల్‌లో అరుదైన లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్
Published on: Thu Apr 30, 2026 5:02PM

హైదరాబాద్ నగరానికి గర్వకారణమైన వైద్య విజయం నమోదైంది. ప్రభుత్వ వైద్యరంగంలో అరుదుగా జరిగే లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసి మరోసారి తమ నైపుణ్యాన్ని చాటుకుంది ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వైద్య బృందం.... గ్లైకోజెన్ స్టోరేజ్ డిసీజ్ అనే అరుదైన వ్యాధితో బాధపడు తున్న కేవలం 18 నెలల చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు ఈ క్లిష్ట శస్త్రచికిత్స చేపట్టారు. సుమారు పది కిలోల బరువు మాత్రమే ఉన్న ఈ చిన్నారికి లివర్ మార్పిడి చేయడం వైద్యపరంగా అత్యంత సవాలుతో కూడుకున్న పని. ఈ కథలో భావోద్వేగానికి హద్దులే లేవు. చిన్నారి తండ్రే తన లివర్‌లోని ఒక భాగాన్ని దానం చేసి ప్రాణదాతగా నిలిచాడు. తండ్రి నుంచి సేకరించిన లివర్ భాగాన్ని అత్యంత జాగ్రత్తగా చిన్నారి శరీరానికి అమర్చారు.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, వైద్యుల అనుభవం కలిసిన ఈ శస్త్రచికిత్స సుమారు 14 గంటల పాటు ఉత్కంఠ భరితంగా కొనసాగి చివరకు విజయం సాధించారు...ఈ క్లిష్టమైన చికిత్స మొత్తం ఆరోగ్యశ్రీ పథకం కింద పూర్తిగా ఉచితంగా అందించడం పేద కుటుంబానికి పెద్ద ఊరటగా మారింది. శస్త్రచికిత్స అనంతరం చిన్నారి ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రభుత్వ రంగంలో ఇలాంటి లివర్ ట్రాన్స్‌ప్లాంట్లు దేశవ్యాప్తంగా చాలా అరుదని నిపుణులు పేర్కొన్నారు. ఈ అద్భుత విజయంపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్య బృందాన్ని అభినందిస్తూ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ప్రపంచస్థాయి వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు. ఈ విజయంతో వైద్యుల సేవలకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.


