TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

"అంకుల్‌.. గుంత‌ల‌ రోడ్లను బాగు చేయండి".. చిన్నారి విజ్ఞ‌ప్తికి స్పందించేనా?

Published on: Fri Mar 4, 2022 11:30AM

రోడ్ల‌పై గుంత‌లు. కాదు కాదు గుంత‌ల రోడ్లు. అస‌ల‌వి రోడ్లే కాదు. ఎగుడుదిగుడు దారులు.. కంక‌ర తేలి.. గుంత‌ల మ‌యంగా మారిన రోడ్లు.. ఇలాంటివి ఏ జిల్లా వెళ్లినా.. ఏ ఊరుకెళ్లినా క‌నిపించాయంటే.. మీరు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉన్న‌ట్టే లెక్క‌. జ‌గ‌న‌న్న వ‌చ్చాక‌.. ఏపీలో రోడ్ల ప‌రిస్థితి దారుణంగా త‌యారైంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ గుండా వెళ్లే జాతీయ ర‌హ‌దారులు మిన‌హా.. రాష్ట్రం నిర్వ‌హించే ఏ ఒక్క రోడ్డు కూడా బాగా లేదు. న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాలు, మండ‌లాలు, గ్రామాలు.. అనే తేడా లేకుండా.. ఏపీలో ఏ మూల‌కు వెళ్లినా.. గుంత‌లే.. కంక‌ర తేలిన దారులే. ఫోర్ వీల‌ర్‌లో వెళితే ఎడ్ల‌బండిపై వెళ్లిన‌ట్టే ఉంటుంది.. టూ వీల‌ర్‌పై వెళితే న‌డుములు విర‌గాల్సిందే. న‌దిలో రాఫ్టింగ్ చేసిన ఫీలింగ్ క‌ల‌గాలంటే.. ఏపీ రోడ్ల‌పై ప్రయాణిస్తే స‌రిపోతుందంటారు. అందుకే, జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏపీ రోడ్ల దుస్థితిపై అప్ప‌ట్లో ఆందోళ‌న‌కు దిగారు. టీడీపీ శ్రేణులు ఎక్క‌డిక‌క్క‌డ నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేశారు. అయినా.. పెద్ద‌గా మార్పేమీ లేదు. ఇప్ప‌టికీ అవే గుంత‌లు.. గండాలు. ఖ‌జానాలో కాసులుంటేగా.. కొత్త రోడ్లు వేసేది? ఉన్న గుంత‌లు పూడ్చేది. అదంతా వేరే విష‌యం.. 

ఇక‌, ఏపీతో పోటీ ప‌డుతున్న‌ట్టుగా తెలంగాణ‌లోనూ అనేక చోట్ల గుంత‌ల రోడ్లు క‌నిపిస్తున్నాయి. హైద‌రాబాద్ న‌గ‌రంలో ప్ర‌ధాన ర‌హ‌దారులు బాగానే ఉన్నా.. గ‌ల్లీల్లో రోడ్లు మాత్రం గుంత‌ల మ‌యంగా మారాయి. రాజ‌ధానిలోనే ప‌రిస్థితి ఇలా ఉంటే.. ఇక జిల్లాల్లో రోడ్లు మ‌రీ బేకార్‌.

తాజాగా.. హైద‌రాబాద్‌లో రోడ్ల దుస్థితిపై ఓ చిన్నారి వినూత్న నిర‌స‌న తెలిపింది. "కమిషనర్‌ అంకుల్‌.. గుంతల రోడ్లను బాగు చేయండి" అంటూ ఆ చిన్నారి ప్లకార్డు పట్టుకుంది. తాను రోజూ స్కూల్‌కు వెళ్లే దారిలో గుంతల రోడ్లు ఇబ్బందికరంగా మారాయని, వెంటనే వాటిని బాగు చేసి పుణ్యం కట్టుకోండి అని ఆ చిన్నారి వేడుకుంది. 

మీర్‌పేట్‌ కార్పొరేషన్‌ 36వ డివిజన్‌లోని ఎంఎల్‌ఆర్‌ కాలనీకి చెందిన మూడేళ్ల "నిర్విజ్ఞ" ఆ దారిలో రోజూ స్కూల్‌కు వెళుతూ గుంతల రోడ్ల దుస్థితిని ఇలా అధికారుల దృష్టికి తీసుకొచ్చింది. ఆ చిన్నారి తండ్రి లోక్‌సత్తా నాయకుడు కావ‌డంతో కూతురి చేతికి ప్లకార్డు ఇచ్చి ఇలా గుంతల రోడ్డు ద‌గ్గ‌ర‌ నిరసన చేయించారు. ఐడియా తండ్రిదే అయినా.. అమ‌లు చేసింది మాత్రం ఆ చిన్నారు. ఈ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో అధికారులు ఉలిక్కిప‌డ్డారు.