అప్పుల కోసం లిక్కర్ సేల్స్ హైక్! జగన్ సర్కార్ పై జనాల ఫైర్ 

అధికారంలోకి వస్తే దశల వారీగా మద్యపాన నిషేదం.. ఇది ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్ శపథం. మాట తప్పం.. మడమ తిప్పం ఇది వైసీపీ జగనిన్నాదం. కాని పవర్ లోకి వచ్చినప్పటి నుంచి మాట తప్పుతూనే ఉన్నారు.. మడమ తిప్పుతూనే ఉన్నారు జగన్ రెడ్డి. మొదట మద్యం దుకాణాలను తగ్గించి గొప్పలు చెప్పుకుంది జగన్ సర్కార్. దశల వారీగా మిగితా షాపులు తగ్గిస్తామని ప్రకటించింది. కాని లిక్కర్ సేల్స్ లో చూస్తే మాత్రం గతంలో కంటే ఆదాయం పెరిగింది. లిక్కర్ ద్వారా వచ్చే అదాయాన్ని మరింత పెంచుకునేందుకు ఇప్పుడు కొత్త ఎత్తులు వేస్తోంది. అంతేకాదు లిక్కర్ సేల్స్ పెంచుతామని చూపిస్తూ ప్రైవేట్ బ్యాంకర్ల ద్వారా వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకుంటోంది. ఏపీ సర్కార్ నిర్ణయాలతో మడమ తిప్పావా జగన్ అంటూ జనాల నుంచి విమర్శలు వస్తున్నాయి. 

 

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. ప్రభుత్వ అస్తవ్యస్థ విధానాలతో ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా అష్టకష్టాలు పడాల్సి  వస్తోంది. కేంద్రం నుంచి కూడా నిధులు వచ్చే సీన్ లేదు. ఇప్పటికే పరిమితికి మించి అందిన కాడికి ప్రభుత్వ రంగ సంస్థల నుంచి అప్పులు తెచ్చుకుంది జగన్ సర్కార్. అయినా నిధుల కటకటే ఉండటంతో ప్రైవేట్ సంస్థల దగ్గర అప్పులు చేయడానికి సిద్దమవుతోంది. అయితే ఇచ్చిన రుణం ఎలా తీరుస్తారన్న దానిపై సరైన ఆదాయ మార్గాలను సర్కార్ చూపించాల్సి ఉంటుంది. ఇందుకోసం లిక్కర్ ను ఎంచుకుంది జగన్ సర్కార్. లిక్కర్ సేల్స్ పెంచి.. దాని ద్వారా వచ్చే ఆదాయంతో అప్పులు తీరుస్తామని ప్రైవేట్ బ్యాంకర్లకు చెబుతోంది. ఇలా లిక్కర్ సేల్స్ ను ఆదాయ వనరుగా చూపుతూ.. లిక్కర్ సేల్స్ ను మరింతగా పెంచుతామని చెబుతూ  దాదాపు 25 వేల కోట్ల రూపాయలు అప్పుగా తెచ్చుకునేందుకు జగన్ సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది.

 

అప్పుల కోసం లిక్కర్ సేల్స్  పెంచుతామని హామీ ఇస్తున్న జగన్ సర్కార్ నిర్ణయంపై ఏపీ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. దశల వారీగా మద్యపాన నిషేదం అమలు చేస్తామని హామీ ఇచ్చి.. ఇప్పుడు దశల వారీగా ఎక్స్లైజ్ ఆదాయం పెంచుకోవాలని చూడటం ఏంటనే ప్రశ్న ప్రజల నుంచి వస్తోంది. జగన్ సర్కార్ తాజా నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ లో  మద్యపాన నిషేదం అమలు హామీ అటకెక్కినట్లేనా అన్న చర్చ జరుగుతోంది. అదాయం కోసం ఇబ్బడి ముబ్బడిగా లిక్కర్ సేల్స్ పెంచుకుంటున్న వైసీపీ ప్రభుత్వం.. ఇక మద్యపాన నిషేదం ఎక్కడ అమలు చేస్తుందనే విమర్శలు వస్తున్నాయి. మాట తప్పేది లేదని చెప్పుకునే జగన్ మరోసారి మాట తప్పి మడమ తిప్పారనే సెటైర్లు పేలుతున్నాయి. 

 

నిజానికి ఏపీలో దశలవారీగా మద్య నిషేధం తెస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చింది వైఎస్సార్సీపీ. తమ ప్రభుత్వం ఏర్పడగానే రాష్ట్రంలోని బెల్ట్ షాపులన్నీ మూసివేస్తున్నట్టు ప్రకటించింది. ఆ తర్వాత, ఏటా మద్యం షాపులను సంఖ్యను తగ్గించుకుంటూ వస్తామంటూ కొత్త మద్యం విధానాన్ని తీసుకువచ్చింది. మద్యం ధరలను భారీగా పెంచింది. మద్యాన్ని ఖరీదైన సరుకుగా మార్చితే, కొనుగోలు చేసేందుకు భయపడే పరిస్థితి వస్తుందని సీఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు.కానీ మద్యంపై ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం విషయంలో పెద్దగా మార్పు కనిపించడం లేదు. ఏపీలో కొత్త మద్యం విధానం అమలులోకి వచ్చి ఏడాది పూర్తైంది. లాక్‌డౌన్ కారణంగా నెలన్నర పాటు మద్యం అమ్మకాలు నిలిచిపోయాయి. అయినా లిక్కర్ ద్వారా ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం విషయంలో పెద్దగా మార్పు లేదని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. దీంతో మద్యపాన నిషేదంపై జగన్ సర్కార్ చెబుతున్నదంటూ బోగసేనని తేలుతోంది.