లింగంపల్లి పసికందు కిడ్నాప్ కేసు ఛేదన..అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్..!
Published on: Fri Jul 3, 2026 5:08PM

లింగంపల్లి పసికందు కిడ్నాప్ కేసును చందానగర్ పోలీసులు ఛేదించారు. అంతర్రాష్ట్ర బాలల అక్రమ రవాణా ముఠాను అరెస్ట్ చేసి, అపహరణకు గురైన నెల రోజుల పసిపాపను సురక్షితంగా రక్షించి కన్నతల్లికి అప్పగించారు. ఈ విషయాన్ని సైబరాబాద్ పోలీసు కమిషనర్ రమేష్ రెడ్డి వెల్లడించారు.
జూన్ 30వ తేదీ తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లాకు చెందిన ఓ సర్కస్ కార్మికురాలు తన బృంద సభ్యులతో కలిసి లింగంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని ఫుట్‌పాత్‌పై నిద్రిస్తుండగా, ఆటోలో వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె ఒడిలో ఉన్న నెల రోజుల పసిపాపను బలవంతంగా అపహరించి పరారయ్యారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శేరిలింగంపల్లి జోన్ ఆర్‌సీపురం డివిజన్ ఏసీపీ సి.హెచ్.వై. శ్రీనివాస్ ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, సైబరాబాద్, హైదరాబాద్, మల్కాజ్‌గిరి ప్రాంతాల్లో మూడు రోజులపాటు వందలాది సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. అనంతరం నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
దర్యాప్తులో కోల్‌కతాకు చెందిన సంతానం లేని ఓ మహిళ డబ్బు చెల్లించి శిశువును అక్రమంగా దత్తత పేరుతో కొనుగోలు చేయాలని ప్రయత్నించినట్లు వెల్లడైంది. హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు మహిళలు మధ్యవర్తులుగా వ్యవహరించగా, వికారాబాద్‌కు చెందిన ఇద్దరు నిందితులు పాపను అపహరించినట్లు పోలీసులు గుర్తించారు.
నిందితులు రూ.1.50 లక్షలకు శిశువును విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకుని, కోల్‌కతాకు తరలించే ఏర్పాట్లు చేసినట్లు విచారణలో తేలింది. కొనుగోలుదారురాలు హైదరాబాద్‌కు చేరుకుని శిశువును తీసుకెళ్లేలోపే పోలీసులు వేగంగా స్పందించి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి పసిపాపను సురక్షితంగా రక్షించారు. అనంతరం చిన్నారిని క్షేమంగా కన్నతల్లికి అప్పగించారు.
మూడు రోజులపాటు నిరంతర దర్యాప్తు, వందలాది సీసీటీవీ ఫుటేజీల పరిశీలన, పోలీసు బృందాల సమన్వయంతో అంతర్రాష్ట్ర బాలల అక్రమ రవాణా ముఠాను ఛేదించి పసిపాపను రక్షించగలిగామని సైబరాబాద్ పోలీసు కమిషనర్ రమేష్ రెడ్డి తెలిపారు. కేసును ఛేదించిన పోలీసు బృందాలను ఆయన అభినందించారు.


