మంత్రులు,అధికారుల మధ్య 'వార్'కొత్త మలుపు
Published on: Wed Feb 8, 2012 9:46AM
హై
దరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఇరకాటంలో పడుతోంది. 'పెద్ద చేపల'పై చర్యలు తీసుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితులు ఎదురవుతున్నాయి. తద్వారా, మంత్రులు, అధికారుల మధ్య నడుస్తున్న 'వార్' కొత్త మలుపు తిరుగుతోంది. ఎక్సైజ్ సిండికేట్ రికార్డుల్లో పేరు ఉన్నందుకే కొందరు ఎక్సైజ్ సిబ్బందిని ఏసీబీ అరెస్టు చేసిందని, మరెందరికో ఫోన్లు చేసి వేధిస్తోందని, ఇప్పుడు ఏకంగా ఏసీబీ రిమాండ్ రిపోర్టులోనే మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లు ఉన్నాయని, వారిపైనా చర్యలు తీసుకోవాలని, తమతోపాటు వారిని కూడా అరెస్టు చేయాలని ఎక్సైజ్, పోలీసు అధికారులు డిమాండ్ చేస్తున్నారు. పలు జిల్లాల్లో ఏసీబీ మంగళవారం దాడులు చేసింది. ఈ సందర్భంగా సంబంధిత ఎక్సైజ్ సిబ్బంది కనిపించడం లేదని వారి కుటుంబ సభ్యులను వేధించారని అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికితోడు, ఏసీబీ నివేదికల్లో ఎక్సైజ్ సిబ్బందితోపాటు మునిసిపల్, తూనికలు, కొలతల అధికారులు, ప్రజా ప్రతినిధులు ఉన్నారని తేలినా, వారిని ఎవరినీ అరెస్టు చేయకుండా కేవలం ఎక్సైజ్ సిబ్బందిని మాత్రమే అరెస్టు చేయడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. 'రోజూ నరకం చూపొద్దు. ఇప్పటిదాకా జరిపిన సోదాల్లో ఆధారాలు లభించి ఉంటే... ఒకేసారి అరెస్టు చేయండి' అంటూ ఎక్సైజ్ అధికారులు ఆక్రోశిస్తున్నారు.
"మద్యం సిండికేట్ల నిర్వాహకుల ఖాతా పుస్తకాలు, రికార్డుల్లో పేరున్నంత మాత్రాన మేం అవినీతిపరులమేనా? ఆయా అధికారులకు ఫోన్లు చేసి సతాయించడం సరికాదు. మీ వద్ద ఉన్న జాబితాను ఎక్సైజ్ కమిషనర్‌కు ఇవ్వండి. అవినీతికి పాల్పడినట్లు విచారణలో నిర్ధారణ అయితే... వారిని సస్పెండ్ చేయండి. కావాలంటే అరెస్టు కూడా చేసుకోవచ్చు. రోజుకో జిల్లాలో సోదాలు నిర్వహించడం, వివరాలు మీడియాకు వెల్లడించడం సరికాదు. దీనివల్ల తీవ్ర ఇబ్బంది కలుగుతోంది'' అని వాపోతున్నారు. ఏసీబీ అధికారులు ఇటీవల మద్యం సిండికేట్ల కార్యాలయాలు, వ్యాపారుల నివాసాల్లో సోదాలు జరిపి రికార్డులు, ఖాతా పుస్తకాలు, హార్డ్‌డిస్క్‌లు, సీడీలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఎక్సైజ్ అధికారులు విధులకు హాజరుకాకుండా, తమ కార్యాలయాలకు దూరంగా ఉంటున్నారు.


