మద్యం సిండికేట్ స్కాంలో ఇరుక్కున్న మంత్రి మోపిదేవి
Published on: Wed Feb 8, 2012 8:52AM
హైదరా
బాద్: మద్యం సిండికేట్ ముడుపుల వివాదంలో ఎక్సైజ్ మంత్రి మోపిదేవి వెంకటరమణ ఇరుక్కున్నారు. మద్యం సిండికేట్ల వ్యవహారంలో ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఎక్సైజ్ శాఖ మంత్రికి 10 లక్షల రూపాయలు ముడుపుగా ఇచ్చినట్లు ఖమ్మం, వరంగల్ జిల్లాలో మద్యం సిండికేట్ కింగ్ రమణ వాంగ్మూలాన్ని ఎసిబి అధికారుల రిమాండ్ నోట్‌లో పేర్కొన్నారనే సమాచారం మంగళవారం సంచలనం సృష్టించింది. అయితే ఈ ఆరోపణలను మంత్రి మోపిదేవి ఖండించారు. కోర్టుకు రిమాండ్ రిపోర్టు ఇచ్చేముందు ఎసిబి తన అభిప్రాయాన్ని తెలుసుకుని ఉండాల్సిందని మీడియాతో మాట్లాడుతూ మంత్రి మోపిదేవి అన్నారు. బుధవారం ముఖ్యమంత్రిని కలిసి దీనిపై విచారణ జరపాలని కోరతానని చెప్పారు. తనపై వచ్చిన ఆరోపణలు రుజువైతే రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమేనని మోపిదేవి స్పష్టం చేశారు.
ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో మద్యం సిండికేట్లపై వారం రోజుల క్రితం ఎసిబి అధికారులు చేసిన దాడుల సందర్భంగా మద్యం వ్యాపారి రమణను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. తన మిత్రుడు రాజాబాబు సహాయంతో హైదరాబాద్‌లోని మంత్రి ఇంటికి వెళ్ళి 10 లక్షల రూపాయలు ఇచ్చినట్లు రమణ తన వాంగ్మూలంలో పేర్కొన్నట్టు ఎసిబి అధికారులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. మంత్రి మోపిదేవితోపాటు సిపిఐ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వరరావుకు 3 లక్షలు, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావుకు 4.5 లక్షలు, మెహబూబాబాద్ ఎమ్మెల్యే కవితకు 5 లక్షలు, సత్తుపల్లి ఎమ్మెల్యే వెంకట వీరయ్యకు మూడు లక్షలు, సిపిఎం జిల్లా కార్యదర్శి పి సుదర్శన్‌కు మూడు లక్షలు, టిఆర్‌ఎస్ జిల్లా కన్వీనర్ రాజేందర్‌కు 60వేల రూపాయలు ఇచ్చానని రమణ చెప్పినట్టుగా ఏసిబి రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. కేవలం నేతలు, చోటామోటా నాయకులకే కాదు స్థానిక ఎక్సైజ్, పోలీసు అధికారులకు సైతం భారీగా మామూళ్ళు ఇచ్చినట్లు ఏసీబీ వరంగల్ పోలీస్‌స్టేషన్‌కు పంపించిన రిమాండ్ రిపోర్ట్ తేటతెల్లం చేసింది. అయితే సీపీఎం నేతలు మాత్రం తాము సిండికేట్ల దగ్గర మామూళ్ళు తీసుకోలేదని స్పష్టం చేస్తున్నారు. ఖమ్మంలో జరిగిన రాష్ట్ర మహాసభల కోసం మద్యం వ్యాపారుల నుంచి చందాలు తీసుకున్నామంటున్నారు. లిక్కర్ డాన్ రమణ దగ్గర బయటపడ్డ నిజాలు రెండు జిల్లాల్లో నాయకులు, అధికారుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తున్నాయ్.


