Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...డబ్బుకు కళ్లెం వేయండి ఇలా…!!
posted on: Apr 28, 2022 9:30AM
నెల చివరికి వచ్చిందంటే చాలామంది జేబులు కాళీ అవుతాయి. ఇంకా నెల నెలా జీతం తీసుకునే వాళ్ళ ఇళ్లలో అయితే పది రూపాయలు కావాలన్నా వెతుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఏవైన అత్యవసర ఖర్చులు వచ్చాయంటే నెల చివరలో సతమతమైపోతారు. అప్పులు చేయాల్సిన పరిస్థితులు వచ్చేది అలాగే. కానీ వీటి గూర్చి ఎవరూ పెద్దగా ఆలోచన చేయరు. ఫలితంగా నెల చివర్లో ఆర్థిక ఇబ్బంది. నెల మొదట్లో, నెల మధ్యలో పిల్లల ఇష్టాలు, అవసరాలు తీర్చినట్టు, కుటుంబం గడిపినట్టు నెల చివర గడపలేము. అయితే వీటన్నిటికీ సులువైన మార్గాలున్నాయి.
పక్కా ప్లానింగ్ వేసుకుంటే నెల మొత్తం ఓకేలాగా 100% కాకపోయినా తృప్తి పడేలాగా గడిపేయచ్చు.
సాలరీ రాగానే కట్టాల్సివన్నీ కట్టేస్తాం. ఆ తరువాత మిగిలేది కాస్తో కూస్తో. అయితే దేనికి ఎంత ఖర్చు చేస్తున్నాం అనేది ఇక్కడ ముఖ్యమైన విషయం. కొన్నిసార్లు పెద్దగా ప్రాధాన్యత లేకున్నా చేతిలో డబ్బులున్నాయని షాపింగ్ కు వెళ్లడం, బయట రెస్టారెంట్లకు వెళ్లడం. ఏదో నచ్చిందని, మరేదో తక్కువ ధరకు ఆఫర్ లో వస్తుందని. ఇలా కారణాల వల్ల కొనేవాళ్ళు చాలామంది ఉంటారు. నిజానికి వీళ్లే నెలచివర్లో ఇబ్బంది పడుతుంటారు కూడా.
కట్టడి కాదు కట్టుబడి!!
నిజమే!! చాలామంది ఖర్చుల విషయంలో కట్టడి చేసుకోవాలి అనుకుంటారు. అయితే కట్టడి కాదు చేయాల్సింది. కట్టుబడి ఉండటం. ప్రణాళికలో భాగంగా దేనికి ఎంత పెట్టాలి?? ఎంత అవసరం?? ఎంత ఖర్చుపెడుతున్నాం ఇలాంటివి ఆలోచించుకోవాలి. చేతిలో పైసా ఉంటే ఏదో ఒకటి కొనేయలని అనిపిస్తుంది.
ఆన్లైన్ తో పడుతూ లేస్తూ!!
ఆన్లైన్ లో నగదు చెల్లింపులు వచ్చాక అంతా సులభం అయిపోయింది, సమయం ఆదా అయింది. కానీ డబ్బును మాత్రం చాలా సులువుగా ఖర్చుపెట్టేస్తున్నారు. ఒకప్పుడు డబ్బు అవసరం అయితే నాన్న బ్యాంక్ కు వెళ్ళాలి, క్యూలో నిలబడాలి, డబ్బులు తీసుకొచ్చి ఇవ్వాలి. అప్పుడు దాన్ని అమ్మ ఏ డబ్బాలోనో, లేక బీరువాలోనో దాచి రూపాయి రూపాయి లెక్కబెట్టి మరీ బయటకు తీసేస్తుంది. అపుడు నెల చివర వచ్చినా ఇంత ఇబ్బంది ఉండేది కాదు. ముఖ్యంగా అమ్మ పోపుల డబ్బాకు ఉన్న పవర్ అదేమో అనుకునేవాళ్ళం కూడా. కానీ అదంతా మనుషుల జాగ్రత్త కదా!!
సేవింగ్స్ సర్వింగ్స్!!
ప్రతి నెల సంపాదనలో సేవింగ్స్ అంటూ కొన్ని ఉంటాయి. వాటిని కూడా నేల నెల కట్టేస్తారు. అయితే వచ్చే తిరకాసు ఒకటే. నెల నెలా సేవింగ్స్ కంటే ఆరు నెలలకు, సంవత్సరానికి ఒకసారి పెద్ద మొత్తంలో కట్టాల్సి ఇన్సూరెన్స్ పాలసిలు సినిమా చూపిస్తాయి. అందుకే వాటికోసం ప్రతినెలా కొంత మొత్తం పక్కనపెట్టాలి. తద్వారా అవి భారం అవ్వవు.
పొదుపు మంత్రం భవిత బంగారం!!
పొదుపు పొదుపు అని తల తినేస్తున్నారేంటి అనిపిస్తుంది. కానీ పొదుపు అనేది పెద్దలకు కాదు పిల్లలకు కూడా. ఇంట్లో పిల్లలకు ఓ పిగ్గి బ్యాంక్ ఇచ్చి చూడండి. వాళ్ళ అనవసర ఖర్చులు పోయి సేవింగ్స్ లోకి జర్నీ స్టార్ట్ చేస్తారు. నిజం చెప్పాలంటే అలా పిల్లల సేవింగ్స్ ఏ పెద్దలను ఎన్నో సందర్భాలలో రక్షిస్తుంది కూడా. పొదుపు గురించి కొంత అవగాహన దాని రుచి తెలిసాక అనవసర ఖర్చులు చేయకుండా ఎంతో జాగ్రత్త పడతారు. పొదుపంటే పిసినారితనం కాదని, అది కూడా ఒక కళ అని తొందరలోనే గుర్తిస్తారు.
లోకమంతా డబ్బులో కొట్టుమిట్టాడుతున్నపుడు, డబ్బుకు ఈ లోకమే దాసోహం అయినపుడు డబ్బు విషయంలో జాగ్రత్త ఉంటూ దాన్ని ఎలా వాడాలో, మనకు కష్టం రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో ఆలోచిస్తే తప్పేమీ లేదు, మనం, ముఖ్న పిల్లలు దాన్ని ఆచరణలో పెడితే అస్సలు తప్పు లేదు!!
◆ వెంకటేష్ పువ్వాడ






