నిబ్బరంగా ఉండకపోతే


అది ఓ పెద్ద పడవ. ఆ పడవలో వందమందికి పైగా ప్రయాణికులు పయనిస్తున్నారు. అకస్మాత్తుగా ఆకాశం మేఘావృతమైపోయింది. చూస్తూ చూస్తుండగానే చిరుజల్లు మొదలైంది. ఆ చిరుజల్లు కాస్తా క్షణాల్లో పెనుతుపానుగా మారిపోయింది. పడవలోని ప్రయాణికులంతా బిక్కుబిక్కుమంటూ ఆ పరిస్థితిని గమనిస్తున్నారు. తాము ఎలాగైనా సురక్షితంగా బయటపడితే బాగుండురా భగవంతుడా! అని ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థిస్తున్నారు. కానీ ఒక ప్రయాణికుడు మాత్రం ఈ పరిస్థితిని తట్టుకోలేకపోయాడు. అరుపులు, ఏడుపులు, శాపనార్థాలతో గోల పెట్టడం మొదలుపెట్టాడు. అతను అలా అటూ ఇటూ కదలడం వల్ల పడవకి మరింత ప్రమాదం అని ఎందరు చెప్పినా ఊరుకోలేదు. తన పెడబొబ్బలకి పసిపిల్లలు భయపడతారని వారించినా వెనక్కి తగ్గలేదు.

 

పడవ యజమానికి ఏం చేయాలో తోచలేదు. ఆ ఒక్క ప్రయాణికుడు స్థిమితంగా లేకపోవడం వల్ల ప్రయాణికులంతా భయంలో, ప్రమాదంలో పడుతున్నారని అతనికి తెలుసు. కానీ ఏం చేయడం? నయానా భయానా ఎంతగా వారించేందుకు ప్రయత్నించినా ఆ కంగారు ప్రయాణికుడు మాత్రం తన గొంతుని తగ్గించడంలేదు.

 

ఇదంతా గమనిస్తున్న ఓ స్వామిజీ నిదానంగా పడవ యజమాని దగ్గరకు వెళ్లాడు. ‘మీరు కనుక అనుమతిస్తే, నేను ఆ ప్రయాణికుడిని శాంతింపచేయగలను,’ అని సూచించాడు. యజమాని సరే అనగానే పడవ నడిపేవారి వద్దకు వెళ్లి, వారి చెవిలో ఏదో చెప్పాడు. వెంటనే పడవ నడిపేవారంతా కలసి.... గగ్గోల పెడుతున్న ప్రయాణికుడిని ఒక్కసారిగా నీటిలో పడేశారు. దాంతో ఆ ప్రయాణికుడు చేతులు కాళ్లు కొట్టుకుంటూ, నడిసముద్రంలో ప్రాణాల కోసం అర్తనాదాలు చేయడం మొదలుపెట్టాడు. జరుగుతున్న తంతుని తోటి ప్రయాణికులంతా దిగ్భ్రాంతితో గమనించసాగారు. ఇలా ఓ రెండు నిమిషాలు గడిచిన తరువాత, ఆ ప్రయాణికుడిని పడవలోకి చేర్చమని అడిగారు స్వామీజీ.

 

ప్రయాణికుడిని తిరిగి పడవలోకి చేర్చగానే అతను ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయాడు. అప్పటివరకూ కేకలు వేసినవాడల్లా నిస్తేజంగా ఉండిపోయాడు. అతడిని చూస్తూ స్వామిజీ చిరునవ్వుతో ‘మనం ఉన్న పరిస్థితి ఎంత సురక్షితంగా ఉందో అన్న విషయం, అంతకంటే దారుణమైన ప్రమాదంలోకి చేరుకుంటే కానీ తెలియదు. కాస్తంత మబ్బులు కమ్ముకోగానే నువ్వు భయపడిపోయావు. కానీ ఇంత నడిసముద్రంలో నీకంటూ నీడగా ఓ పడవ ఉందనీ, నిన్ను కాపాడేందుకు వందల మంది మనుషులు ఉన్నారనీ మర్చిపోయావు. ఒక్క గంట గడిస్తే చాలు తీరాన్ని చేరుకుంటానని కూడా నీకు తట్టలేదు. నీటిలో పడగానే, ఈ నావే నీకు ఆధారం అన్న విషయం నీకు గుర్తుకువచ్చింది. ఇంతకుముందు ఆ విచక్షణ లేకపోవడం వల్ల నీతోపాటు తోటి ప్రయాణికులను కూడా భయపెట్టేశావు. పడవ మునిగిపోయే పరిస్థితులు కల్పించావు. నీ పట్ల నమ్మకం, నువ్వున్న పరిస్థితుల మీద కృతజ్ఞత లేకపోతే... నువ్వు ఏ తీరాన్నీ చేరుకోలేవు,’ అంటూ చెప్పుకొచ్చారు.


(ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)

- నిర్జర.