చంద్రబాబు ప్రాణానికి ముప్పు!.. రక్షణ కోసం డీజీపీకి ఫిర్యాదు!!
Published on: Wed Mar 9, 2022 11:00AM
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజల మనిషి. ప్రజల కోసం.. ప్రజల కొరకు.. అనునిత్యం పోరాటే నాయకుడు. ప్రజలే ఆయనకు ప్రాణం. ప్రజలు మినహా ఆయనకు మరో వ్యాపకం లేదు. అదే ఇప్పుడు ఆయన ప్రాణాలకు ముప్పుగా మారిందంటున్నారు. ఆంధ్రుల కోసం.. ఎవరితోనైనా, ఎందాకైనా పోరాడుతుండటం.. కొందరు సహించలేకపోతున్నారని అంటున్నారు. ప్రజా గొంతుక చంద్రబాబును.. అడ్డుతొలగించుకునే కుట్ర, ప్రయత్నం జరుగుతోందని పార్టీ సభ్యులు భావిస్తున్నారు. అందుకే, తమ అధినేతకు, టీడీపీ కేంద్ర కార్యాలయానికి రక్షణ కల్పించాలంటూ పోలీసులను కోరుతున్నారు. గతంలో చంద్రబాబు ఇంటిపై దాడి, టీడీపీ ఆఫీసు విధ్వంసం తదితర పరిణామాల నేపథ్యంలో సాయుధ భద్రత తప్పనిసరి అని విజ్ఞప్తి చేస్తున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబుకు సంఘ విద్రోహ శక్తుల నుంచి ముప్పు ఉందని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయానికి సాయుధ బలగాలతో భద్రత కల్పించాలంటూ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాశారు.
ప్రజా సమస్యలపై చర్చ కోసం రాష్ట్రం, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి నేతలు వస్తుంటారని వర్ల రామయ్య గుర్తు చేశారు. వారికి సైతం తీవ్రవాదులు, సంఘ వ్యతిరేక శక్తుల నుంచి తీవ్ర ముప్పు ఉందన్నారు. పార్టీ కార్యాలయంపై ఇటీవల కొందరు దాడి చేశారని ప్రస్తావించారు. అందువల్ల సాయుధ బలగాలతో కార్యాలయానికి 24 గంటల రక్షణ కల్పించాలని డీజీపీకి రాసిన లేఖలో కోరారు వర్ల రామయ్య. ఆయన రాసిన ఈ లేఖ.. ఇప్పుడు ఏపీలో కలకలంగా మారింది. చంద్రబాబు భద్రతపై అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


