పసిపిల్లలు కోపాన్ని పసిగట్టేస్తారు

పసిపిల్లల ముందు కోపంగా ఏదన్నా ఒక మాట అంటే... వారు ఒక్క క్షణం బిత్తరపోవడాన్ని గమనించవచ్చు. ఇంకా పారాడే పసిపిల్లలే కదా! వారికి మన మాటల్లోని కోపం, ఉద్రిక్తత, చిరాకు, సంతోషం, ప్రేమ... వంటి అనుభూతులు ఎలా తెలుస్తాయి? అనుకోవడానికి వీల్లేదు. పసిపిల్లలకు ఇంకా భాష రాకపోయినా భావం తెలిసిపోతుంది అంటున్నారు శాస్త్రవేత్తలు.

భాష - భావం

మనం ఏ భావంతో మాట్లాడుతున్నామన్న విషయాన్ని పిల్లలు ఎంతవరకు గ్రహించగలుగుతారు అనే అనుమానంతో పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు పరిశోధకులు ఒక ప్రయోగాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా వారు ఒకే తరహా వాక్యాన్ని వేర్వేరు ఉద్వేగాలతో పిల్లల ముందు పలికి చూశారు. అలా ఒకే వాక్యాన్ని వేర్వేరు రకాలుగా పలికినప్పుడు, పిల్లల మెదడులో ఎలాంటి ప్రతిస్పందనలు ఏర్పడుతున్నాయో గమనించేందుకు వారి మెదడుని స్కానింగ్ చేశారు.

పట్టేశారు

ఆశ్చర్యకరంగా వాక్యంలోని పదాలు మారకపోయినా... ఆ వాక్యాన్ని ఉచ్ఛరించిన తీరు ద్వారా పిల్లలు, ఆ మాట వెనుక ఉన్న ఉద్వేగాన్ని గమనిస్తున్నట్లు తేలింది. ఇది ఏమంత తేలికైన ప్రక్రియ కాదంటున్నారు పరిశోధకులు. ఎంత అధునాతనమైన రోబో అయినా కూడా తను వినే మాట వెనుక ఉన్న భావాన్ని గ్రహించడం కష్టమని అంటున్నారు. అలాంటి ఏడాది అయినా నిండని పసిపిల్లలు ఇలాంటి నేర్పు సాధించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

భారీ పరిశోధనలకు మూలం

పిల్లలు తాము వినే స్వరాల వెనుక దాగిన ఉద్వేగాలను గ్రహిస్తారన్న విషయం తేలిపోయింది సరే! మరి ఆ నేర్పు వారికి ఎలా అలవడుతుంది? ఏ లక్షణాల ఆధారంగా వారు శబ్దాలను విశ్లేషించగలుగుతున్నారు? అన్న విషయాల మీద ఇక పరిశోధన జరగవలసి ఉందట. దీని వలన భాషకు సంబంధించి, పిల్లల మెదడు ఎదిగే విధానానికి సంబంధించి, మనం ఉద్వేగాలను గ్రహించే తీరుని గురించి కొత్త విషయాలు తెలుస్తాయని ఆశిస్తున్నారు.

తస్మాత్ జాగ్రత్త!

పిల్లలోని ఈ నేర్పు వెనుక కారణాలు, దాని వలన ఉపయోగాలు గురించి శాస్త్రవేత్తలు మరిన్ని విషయాలు పరిశోధించేలోపల మనం గ్రహించాల్సిన విషయం ఒకటి ఉంది. పసిపిల్లలే కదా! వారికేం తెలుస్తుందిలే అని వారి ముందు ఎడాపెడా ప్రవర్తించడానికి వీల్లేదు. వారు నిస్సహాయులు కాబట్టి తిరిగి మనల్ని ఏమీ అనలేరు అని విరుచుకుపడటం భావ్యం కాదు. ఏమో వాళ్లేం గ్రహిస్తున్నారో ఎవరికి తెలుసు? వారి మనసులో ఎలాంటి అభిప్రాయాలు రూపొందుతున్నాయో మనమెలా ఊహించగలం? అందుకే, పిల్లల ముందు కూడా తస్మాత్ జాగ్రత్త!

- నిర్జర.