కుగ్రామం నుంచి ముచ్చింతల్ వరకూ.. రామేశ్వర్‌రావు లైఫ్‌లో మెరుపులు, మరకలు..
Published on: Sat Feb 19, 2022 3:30PM
ఆయన రాజకీయ నాయకుడు కాదు. కానీ, తెలంగాణ రాజకీయాలలో ఆయన తెలియని వారే కాదు, ఆయనకు తెలియని వారూ, ఆయనతో ‘టచ్’లో లేని వారు కూడా బహుశా ఉండరు. అలాగే ఆయన ఆధ్యాత్మిక గురువో ఇంకొకటో కాదు. కానీ, తెలంగాణలో ఎంతటి భారీ దైవకార్యం అయినా, నేనున్నానంటూ ముందుండి నడిపించే వ్యక్తి, వ్యాపార వేత్త జూపల్లి రామేశ్వర్ రావు. ఇటీవల 12 రోజుల పాటు, హైదరాబాద్’లో అత్యంత వైభవంగా.. ప్రపంచ దృష్టిని ఆకర్షించే విధంగా చిన జీయర్ స్వామి అధ్వర్యంలో జరిగిన శ్రీ రామానుజుల సహస్రాబ్ది ఉత్సవాలలో జూపల్లి పాత్ర, ప్రమేయం గురించి వేరే చెప్పనక్కరలేదు. శ్రీరామానుజుల దివ్య క్షేత్ర నిర్మాణానికి 100 ఎకరాల భూమిని ఉచితంగా ఇవ్వడమే కాకుండా, సర్వం తానై అంతటి బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించి.. చిన జీయర్ సహా అందరి మన్ననలు అందుకున్నారు జూపల్లి రామేశ్వరరావు.
ఆధ్యాత్మిక రంగంలోనే కాదు, రాజకీయాలలోనూ, జూపల్లి తమ దాతృత్వాన్ని దాచుకోలేదని, అదే తీరుగా పంచుకున్నారని అంటారు. నిజమే, అన్ని పార్టీలలో జూపల్లికి అయిన వాళ్ళు, ఆప్తులు ఉన్నారు. అయితే, ఆయనకు అన్ని పార్టీలు, అందరు నాయకులు సమానమే అయినా, పార్టీలలో తెరాస, నాయకులలో ముఖ్యమంత్రి కేసీఆర్ కొంచెం ఎక్కువ సమానమని అంటారు. నిజానిజాలు ఎలా ఉన్నా, తెరాసకు నిధుల కొరత రాకుండా, నిత్య నైవేద్యం సమర్పించే కొద్ది మంది కోటీశ్వరులలో జుపల్లి ఒకరనే మాట కూడా రాజకీయ వర్గాల్లో తరచూ వినిపిస్తుంది. తెరాసకు నిధులు సమకూర్చడంతో పాటుగా, గులాబీ పార్టీ ప్రచారం కోసం టీవీ 9 సహా ఒకటి రెండు టీవీ చానల్స్’ను జూపల్లి సొంతం చేసుకున్నారు. నిజానికి, కేసీఆర్, జూపల్లి రిలేషన్స్ గురించి ఇంకా చాలా చాలా గుసగుస సంగతులు ఉన్నా, అందులో ఏది నిజమో, ఏది కాదో నిర్ధారించడం కొంచెం కాదు చాలా కష్టం. అంతే కాదు, కేసీఆర్, జూపల్లి రిలేషన్స్’ లో అంబికా దర్బార్ బత్తిలా చినజీయర్ స్వామి ఉన్నారని అంటారు. అయితే ఇప్పుడు ఈ ట్రయాంగిల్ రిలేషన్స్’లో తేడాలు వచ్చాయని అంటున్నారు. ఆ ఇద్దరూ కాషాయం పార్టీతో జట్టు కట్టడం.. కేసీఆర్‌కు రుచించడం లేదని రాజకీయ వర్గాల్లో వినవస్తోంది.
అదలా ఉంటే, అటు దైవ కార్యానికి, ఇటు రాజకీయ కార్యానికి చేతికి ఎముకే లేనట్లు, కోట్లలో విరాళాలు పంచి ఇస్తున్న జూపల్లికి అంత సంపద ఎలా వచ్చింది? ఆయన బంగారు చెంచా నోట్లో పెట్టుకుని, కోటీశ్వరుల కడుపున పుట్టారా? అంటే లేదు. కేవలం 30 ఎకరాల భూమి మాత్రమే ఉన్న ఓ సాధారణ రైతు కుటుంబంలో పుట్టారు జూపల్లి. ఇప్పుడు ఆ 30 పక్కన ఎన్ని సున్నాలు చేరాయో.. ఆయనకే తెలీనంత భూసంపద.
జూపల్లి రామేశ్వరరావు పుట్టింది మహబూబ్‌నగర్ జిల్లాలో. నల్లమల సరిహద్దులలోని కుడికి అనే గ్రామం. ఆ ఊరు దాటితే అడవే అంటే అదెంత కుగ్రామమో అర్థం చేసుకోవచ్చు. ఈ గ్రామ ప్రజలు బస్సు ఎక్కాలంటే మూడు కిలోమీటర్లు నడిచి వెళ్లాలి. అలాంటి గ్రామం నుంచి హోమియో విద్యను అభ్యసించేందుకు జూపల్లి 1979లో హైదరాబాద్‌కు చేరారు. అంతవరకు మహబూబ్ నగర్ దాటి బయటకు రాని ఆయనకు సహజంగానే హైదరాబాద్ కొత్త ప్రపంచంలా కనిపించింది. ఓ వంక హోమియో కాలేజీలో డిగ్రీ చదువుతూ, మరోవంక హైదరాబాద్ నగరాన్ని అవపోసన పట్టారు. సైకిల్ యాత్రలు చేశారు. ఆ తర్వాత ఆయన రియల్ ఎస్టేట్ రంగంలో కాలు పెట్టడానికి అంతకు ముందు అయన చేసిన సైకిల్ యాత్రకు ఏదైనా సంబంధం ఉందో లేదో తెలీదు.
చదువు పూర్తయిన తర్వాత 1982లో దిల్‌షుక్‌నగర్‌లో హోమియో డాక్టర్‌గా ప్రాక్టీసు ప్రారంభించారు జూపల్లి. అదే సమయంలో అయన దృష్టి రియల్ ఎస్టేట్ వ్యాపారంపై పడింది. అయితే, పెట్టుబడికి పైసలు లేవు. మేనమామ దగ్గర 50 వేల రూపాయలు అప్పు తీసుకుని.. మై హోమ్ పేరుతొ రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించారు. ఒక వైపు ప్రాక్టీసు చేస్తూనే మరో వైపు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. మొదట్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతగా కలిసి రాక పోయినా హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌తో పాటు మై హోమ్ గ్రూపు కూడా ఎదిగింది. ఇక అక్కడి నుంచి ఆయన వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం రాలేదు. రియల్ ఎస్టేట్ నుంచి సిమెంట్ తయారీ, విద్యుత్ ఉత్పత్తి, కన్సల్టెన్సీ, విద్యా సహా అనేక ఇతర రంగాలలో వ్యాపారాన్ని విస్తరించారు. వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందడంతో ఆయన మీద అవినీతి ఆరోపణలు మొదలయ్యాయి. ఆయన ఆస్తులపై 2019 సిబిఐ దాడులు నిర్వహించించి. ఇప్పటికీ ఆ కేసు నడుస్తోంది.
ఆయన సొంత గ్రామం మొదలు రాష్ట్రంలో, దేశంలోని అనేక గ్రామాల అభివృద్ధికి తమ వంతు సాయం అందిస్తున్నారు. ఆయన సొంత గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడమే కాకుండా ఆ గ్రామం నుంచి వచ్చిన 200 మందికి పైగా యువకులకు తమ సంస్థల్లో ఉపాధి కలిపించారు. ప్రస్తుతం ఆయన ఆస్తులు రూ.3500 కోట్ల నుంచి రూ.6000 కోట్ల వరకు ఉంటాయని అంటారు. అయితే అందులో నలుపెంత? తెలుపెంత? అనే విమర్శలూ ఉన్నాయి.
ఇక, చినజీయర్ స్వామితో ఆయన అనుబంధం అంతా ఇంతా కాదు. ఆ స్వామి సేవలో నిత్యం తరిస్తుంటారు. జీయర్ విద్యాసంస్థలు, హోమియో వైద్య కళాశాల తదితర రూపాల్లో సేవాకార్యక్రమాలూ చేస్తున్నారు. తాజాగా, ముచ్చింతల్‌లో.. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి.. కర్త చినజీయర్ అయితే.. కర్మ, క్రియ జూపల్లి రామేశ్వరరావునే అంటారు. ఇలా, వ్యాపారం, ఆధ్యాత్మికాన్ని సమతూకంతో బ్యాలెన్స్ చేసుకొస్తున్న.. మైహోం రామేశ్వరరావు జీవితంలో మెరుపులే కాదు.. మరకలూ ఉన్నాయి.


