జీవితం బోర్ కొట్టేస్తోందా!

నిమిషం ఖాళీ లేని జీవితం.... ఇంటినిండా కావల్సినన్ని వస్తువులు. అయినా ఏదో వెలితి. ఆ వెలితి ఒకోసారి హద్దులు దాటి జీవితం అంటేనే బోర్ కొట్టేస్తూ ఉంటుంది. అలాగని ఉన్న ఉద్యోగాన్నీ వదులుకోలేము, సమాజానికి దూరంగానూ పారిపోలేము. కాకపోతే చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే ఆ నిస్సత్తువ నుంచి కాస్త బయటపడవచ్చని అంటున్నారు నిపుణులు...

కదిలి చూడండి

ఒక రెండు రోజులు సెలవు పెట్టి ఏ ఊరికో వెళ్లి చూడండి. అదీ కాదంటారా! దగ్గరలోనే ఉన్న చూడదగ్గ ప్రదేశాలన్నీ ఓ చూపు చూసి రండి. కాదూ, కూడదంటారా! ఊళ్లోనే ఉన్న స్నేహితుల ఇళ్లకు వెళ్లి పలకరించి రండి. మొత్తానికి మీరున్న చోట నుంచి కదిలే ప్రయత్నం చేయండి. రోజూ కళ్ల ముందు కనిపించే వాతావరణం నుంచి కాస్త దూరం జరగండి.

సృజనకు పదునుపెట్టండి

లోలోపల గూడు కట్టుకుపోయి ఉన్న చిరాకులను వెలికితీయాలన్నా, మనసు కాస్త సేదతీరాలన్నా సృజనలో తప్పకుండా సాంత్వన లభిస్తుంది. బొమ్మలు వేయడమో, పాత వస్తువులని కొత్తగా తీర్చిదిద్దడమో... ఆఖరికి ఏ సుడోకుని ఆడటమో చేసే ప్రయత్నం చేస్తే మనసుకి కాస్త ఊరటగా ఉంటుంది.

రొటీన్కు భిన్నంగా

చేయాలనుకుంటే మన చుట్టూ చాలా పనులే ఉంటాయి. వాటిపట్ల మనకి అభిరుచి లేకపోవడం వల్ల మనం దూరంగా ఉంటామంతే! వంట చేయడం, మొక్కలు పెంచడం, డైరీ రాయడం... ఇవన్నీ మనసుని కాసేపు పట్టి ఉంచే పనులే. ఎప్పుడన్నా బోర్ కొట్టినప్పుడన్నా వీటివైపు మళ్లే ప్రయత్నం చేయండి. కావల్సినంత కాలక్షేపం దొరుతుంది. మనసుకి కూడా తృప్తిగా ఉంటుంది.

నలుగురిలో కలవండి

మనసులోని చిరాకుని పంచుకోవాలన్నా, ఒంటరితనం నుంచి తప్పించుకోవాలన్నా... మరో మనిషితో మాట్లాడాల్సిందే! అది ఎదురింటివారైనా కావచ్చు, పాత పరిచయస్తులైనా కావచ్చు. కాసేపు అలా నలుగురి మధ్యలోకీ వెళ్లి వారితో నాలుగు కబుర్లు చెప్పి, కాసేపు నవ్వుకొంటే మనసు తేలికపడుతుంది.

శారీరిక శ్రమ

ఏ పనీ లేనప్పుడు మనసంతా ఏవో ఒక ఆలోచనలతో క్రుంగిపోతుంటుంది. అందుకే శరీరాన్ని కాస్త కష్టపెడితే మనసు కూడా కుదుటపడుతుంది. వ్యాయామం చేయడమో, కాస్త దూరం నడవడమో, ఇల్లు సర్దుకోవడమో చేస్తే శరీరం అలసిపోతుంది. మనసుకి ఆలోచించుకునే సమయం ఉండదు.

కాలక్షేపం చేయండి

అప్పటికప్పుడు మనసుని కాస్త ఉల్లాసపరుచుకోవాలంటే... ఏదన్నా కాలక్షేపం చేయాల్సిందే! పుస్తకం చదవడమో, టీవీ చూడటమో, సినిమాకి వెళ్లడమో... ఇలా కాలాన్ని కాసేపు సరదాగా గడిపేయండి.

మనసుని లయం చేయండి

మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం కష్టమైన పనే. కానీ ప్రయత్నిస్తే తప్పేమీ లేదుగా! సంగీతం వినడమో, ధ్యానంలో మునిగిపోవడమో, గుడికి వెళ్లి కాసేపు సేదతీరడమో చేస్తే... మన సమస్యలన్నీ తాత్కాలికమే అన్న ధైర్యం కలుగుతుంది.

ఏతావాతా అప్పుడప్పుడూ బోర్ కలగడం మంచిదే! మన జీవితంలో ఎక్కడో ఏదో పొరపాటు దొర్లుతోందనే సత్యాన్ని అది తెలియచేస్తుంది. ఆ సమయంలో ఒక్క క్షణం ఆగి మన జీవనవిధానాన్ని తరచి చూసుకుంటే... ఒకోసారి మన గమ్యాన్నే మార్చుకునే అవకాశం కలుగుతుంది.

- నిర్జర.