బోట్లు మునిగి 200 మంది మృతి..

 

రెండు బోట్లు నీటిలో మునిగి పోయిన ఘటనలో దాదాపు 200 మంది మృతి చెందారు. ఈ ఘటన మ‌ధ్య‌ధ‌రా స‌ముద్రంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం..మ‌ధ్య‌ధ‌రా స‌ముద్రంలోని లిబియా తీరం స‌మీపంలో రెండు బోట్లు ముగినిపోయాయి. సుమారు 200 మందికిపైగా మృతిచెందినట్టు తెలుస్తోంది. స్పెయిన్‌కు చెందిన ప్రోయాక్టివ్ ఓపెన్ ఆర్మ్స్ అనే ఎన్జీవో సంస్థ ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. బోల్తా కొట్టిన రెండు బోట్ల నుంచి సుమారు అయిదు మృత‌దేహాల‌ను వెలికితీసిన‌ట్లు ఆ సంస్థ తెలిపింది. ఒక్కొక్క బోటు నుంచి సుమారు వంద మందికిపైగా చ‌నిపోయిన‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. ఆఫ్రికా దేశాల నుంచి మ‌ధ్య‌ద‌రా స‌ముద్రం మీదుగా ఇట‌లీ చేరుకుని అక్క‌డ నుంచి యూరోప్ వెళ్లేందుకు ప్ర‌య‌త్నిస్తున్న శ‌ర‌ణార్థుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్న‌ది. ట‌ర్కీ నుంచి గ్రీస్ మ‌ధ్య ఉన్న రూట్‌ను పూర్తిగా మూసివేయ‌డంతో అక్ర‌మ వ‌ల‌స‌దారులు ట్రైపోలి నుంచి యూరోప్ వెళ్లేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రమాదం చోటుచేసుకుంది.