సీఎంకు రైతు లేఖ.. నన్ను ఆత్మహత్య చేసుకోనివ్వండి

 

ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు అంటారు. అందుకేనేమో మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్ని దశాబ్దాలైనా.. ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే మిగిలిపోయింది. ప్రభుత్వాలు ఎన్ని పథకాలు పెట్టి ఏం లాభం?. అవి రైతు కష్టాలు తీర్చడానికి కాదు కదా.. రైతు కన్నీళ్లను తుడవడానికి కూడా సరిపోవట్లేదు. సరైన వనరులు లేక దిగుబడి రాదు, దిగుబడి వస్తే గిట్టుబాటు ధర ఉండదు. దిగుబడి రాక, గిట్టుబాటు ధర లేక రైతు ఎలా బాగుంటాడు?. రైతు బాలేనప్పుడు దేశం ఎలా బాగుపడుతుంది. తాజాగా ఉత్తరప్రదేశ్ లో ఓ రైతు రాసిన లేఖ మన దేశంలో రైతుల పరిస్థితి ఎలా ఉందో అర్థంపడుతుంది.

ఆగ్రా ప్రాంతానికి చెందిన ప్రదీప్ శర్మ అనే రైతు బంగాళాదుంప పంట వేశారు. దిగుబడి రాక ప్రదీప్ శర్మ అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. తన పరిస్థితిని వివరిస్తూ సీఎం ఆదిత్యనాథ్ యోగికి లేఖ రాశారు. తన పంట దెబ్బతిని తీవ్రంగా నష్టపోగా తనకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద కేవలం రెండువేల రూపాయలే వచ్చాయని రైతు ఆవేదనగా పేర్కొన్నారు. లేఖతో పాటు.. తనకు వచ్చిన రెండువేల రూపాయల చెక్కును ప్రదీప్ సీఎంకి వాపసు పంపించారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన తనకు ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతించాలని ప్రదీప్ సీఎంకు రాసిన లేఖలో వేడుకున్నారు. తాను అద్దె ఇంట్లో నివాసముంటున్నానని పంటలు పండక నష్టపోయానని, తనకు పంట నష్టపరిహారం అందజేసి ఆదుకోవాలని ప్రదీప్ కోరారు. సీఎం తనను ఆదుకోవాలని, లేకుంటే తాను ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతించాలని రైతు ప్రదీప్ శర్మ సీఎం కు రాసిన లేఖలో విన్నవించారు.