TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమల మెట్ల మార్గంలో చిరుత కలకలం

Published on: Sun Jun 1, 2025 10:57AM

తిరుమలలో మరోసారి చిరుత సంచారం  కలకలం రేపింది. శ్రీవారి మెట్ల మార్గంలో భక్తులకు చిరుత కనిపించింది. దీంతో వారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఆదివారం ఉదయం శ్రీవారి మెట్ల మార్గంలో 500వ మెట్టు వద్ద చెట్ల పొదలలో సేదదీరుతున్న చిరుతను గమనించిన భక్తులు వెంటనే అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందించారు. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది సైరన్ మోగించి చిరుతను అడవిలోకి తరిమేశారు.   చిరుత కలకలంతో శ్రీవారి మెట్టు ప్రారంభంలో చెకింగ్ పాయింట్ వద్ద భక్తులను మొదట అధికారులు అనుమతించలేదు. పరిస్థతి పూర్తిగా సద్దుమణిగాక భక్తులను గ్రూపుల వారీగా విభజించి మెట్ల మార్గంలోకి అనుమతించారు.
వారం రోజుల వ్యవధిలో శ్రీవారి మెట్ల మార్గంలో చిరుత సంచారం కనిపించడం ఇది రెండో సారి. గత నెల 25న ఇదే మార్గంలో 350వ మెట్టు వద్ద భక్తులు చిరుతను గుర్తించారు. అప్పట్లో ఇందుకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

 ఇప్పుడు తాజాగా మళ్లీ చిరుత సంచారం కనిపించడంతో భక్తులు తీవ్ర భయాందోళనలకు గురౌతున్నారు.  దీంతో అప్రమత్తమైన టీటీడీ, అటవీశాఖ భక్తులకు పూర్తి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. భక్తులు మెట్ల మార్గంలో ఒంటరిగా కొండపైకి వెళ్లొద్దని సూచించారు. గుంపులుగా మాత్రమే వెళ్లాలని కోరారు. ఇక పోతే 12 సంవత్సరాలలోపు వయస్సున్న వారిని మెట్ల మార్గంలో కొండపైకి అనుమతించకూడదని నిర్ణయించారు.  భక్తుల భద్రత కోసం టీటీడీ అటవీ విభాగం సిబ్బంది మెట్ల మార్గం పొడవునా పెట్రోలింగ్ ఏర్పాటు చేశారు.