వామపక్షాలతో పొత్తు..సీట్లపై పవన్ కసరత్తు

 

ఏపీలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి మొత్తం 175 స్థానాల్లో పోటీచేయనున్నట్లు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పొత్తుపై కసరత్తులో భాగంగా పవన్ కల్యాణ్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ తదితరులు విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో సమావేశమై చర్చించారు. సంక్రాంతి పండుగ తర్వాత... ఈ నెల 17, 18, 19 తేదీల్లో వరుసగా మూడు రోజులపాటు పొత్తులపై మళ్లీ చర్చించేందుకు సమావేశం కావాలని జనసేన - లెఫ్ట్‌ పార్టీలు నిర్ణయించాయి. ఈలోపు సీట్ల కేటాయింపునకు సంబంధించి ఆయా పార్టీలు విడివిడిగా  కసరత్తు పూర్తి చేసుకోవాలని... ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేసే అంశంపైనా చర్చించుకోవాలని నిర్ణయించారు. సీట్ల సర్దుబాటుపై కూడా ముందే ఓ నిర్ణయానికి రావాలనే భావనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యేలోగానే సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తి చేసుకుని ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని జనసేన - లెఫ్ట్ పార్టీలు భావిస్తున్నట్టు సమాచారం.