ఎడమ చేతికి దెబ్బ తగిలితే కుడి చేతికి కట్టు.. బీహార్ వైద్యుల నిర్వాకం

 

 

బిహార్ లో ఇటీవలే  మెదడువాపు వ్యాధి లక్షణాలతో 100 మందికి పైగా చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో బిహార్ ఆరోగ్య శాఖతో పాటు అక్కడి డాక్టర్ల పనితీరుపై తీవ్రంగా విమర్శలు చెలరేగాయి. తాజాగా పట్నాలోని ప్రభుత్వ వైద్యకళాశాలకు ఫైజాన్ అనే బాలుడిని అతని  తల్లిదండ్రులు వైద్య సహాయం కోసం తీసుకు వచ్చారు. మామిడి చెట్టుపై నుంచి కింద పడటంతో ఫైజాన్ ఎడమచేతి ఎముక విరిగినట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది. అయితే అక్కడి వైద్యులు మాత్రం నిక్షేపంగా ఉన్న ఫైజాన్ కుడిచేతికి  కట్టు కట్టేశారు. గాయం అయింది నా ఎడమ చేతికి మొర్రో అని ఆ బాలుడు ఎంత మొత్తుకున్నా వినిపించుకోకుండా కట్టు కట్టేసి వెళ్లి రమ్మన్నారు కానీ గాయానికి మందులు కూడా ఇవ్వలేదు. ఈ విషయం మీడియాలో రావడంతో ఒక్కసారిగా కలకలం రేగటంతో  వెంటనే రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు ఈ నిర్వాకంపై విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై పూర్తి వివరణ ఇవ్వాలని వైద్యులను కూడా ఆదేశించారు.