TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తమిళులను చూసి నేర్చుకోండి.. తెలుగూస్ కు జస్టిస్ ఎన్వీ రమణ సూచన

Published on: Fri Jun 10, 2022 7:26AM

చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ ఎన్వీరమణ తెలుగువారు. తెలుగు భాష పట్ల అపారమైన అభిమానం ఉన్నవారు. ఆయన తెలుగు వారందరికీ ఒక సూచన చేశారు. అదేమిటంటే భాష పట్ల గౌరవం, అభిమానం, మమకారం ఎలా ఉండాలి అన్న విషయాన్ని తమిళులను చూసి నేర్చుకోండి అని. ఈ సూచన ఆయన తెలుగువారి ఆత్మగౌరవ నినాదాన్ని అంతర్జాతీయ స్థాయిలో గుర్తించేలా చేసిన తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవ వేడుక వేదికపై నుంచి చేశారు.

తిరుపతిలో గురువారం జరిగిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ సందర్భంగా ఆయన ఎన్టీఆర్ పట్ల తనకున్న అపార గౌరవాభిమానాలను ఏ మాత్రం దాచుకోకుండా వెల్లడించారు. కృషి ఉంటే మనుషులు రుషులౌతారు మహా పురుషులౌతారు అన్నదానికి అతికినట్లు సరిపోయే ఉదాహరణ ఎన్టీఆర్ అని జస్టిస్ రమణ చెప్పారు. ఎన్టీఆర్ ను ఒక సంపూర్ణ మానవతా మూర్తిగా అభివర్ణించారు.

రైతు బిడ్డగా, రంగస్థల నటుడిగా, సినిమా హీరోగా, రాజకీయ నాయకుడిగా ఎన్టీఆర్ జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహామనీషని కొనియాడారు.  పార్టీ పెట్టిన  తొమ్మిది నెలల్లోనే అధికారం దక్కించుకున్న ఘనత ఎన్టీఆర్ కు మాత్రమే దక్కుతుందన్నారు.. ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.. తనపై ఎన్టిఆర్ మనిషి అని ముద్ర వేశారని, అది తనకు గర్వకారణమని అన్నారు.

 కాలేజీ  రోజుల్లోనే ఆయన తనను అభిమానించే వారని, 1983లో ఆయన కోసం పరోక్షంగా పని చేశానని కూడా చెప్పుకొచ్చారు. ఆగస్టు సంక్షోభం సమయంలో ఎన్టీఆర్ తరుపున వాదించేందుకు ఎవరూ ముందుకు రాలేదని, అయితే  అశేష ప్రజాభిమానమే ఆయనకు అండగా నిలిచిందన్నారు.  ఎన్టీఆర్‌కు పద్మ, ఫాల్కే వంటి అవార్డులు దక్కకపోవడం తెలుగు వారి దురదృష్టమన్న జస్టిస్ ఎన్వీ రమణ తాను పదవీ విరమణ చేసిన తరువాత ఎన్టీఆర్ పై పుస్తకం రాస్తానని చెప్పారు.