TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

విమాన ప్రమాదాలు.. నాయకుల మరణాలు!

Published on: Wed Jan 28, 2026 12:22PM

అజిత్ పవార్ మరణం భారత రాజకీయాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. దేశ చరిత్రలో ఇలా విమాన లేదా హెలికాప్టర్ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన ప్రముఖ రాజకీయ నాయకుల జాబితా చాలా పెద్దదే. 
మహా ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ బారామతిలో విమాన ల్యాండింగ్ సమయంలో  జరిగిన ప్రమాదంలో బుధవారం (జనవరి 28) మరణించారు. గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ 2025లో అహ్మదాబాద్ సమీపంలో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించారు. 

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ 2021లో తమిళనాడులోని కూనూర్ వద్ద.. హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. నాటి ఆంధ్రప్రదేశ్ సీఎం వై.ఎస్. రాజశేఖర రెడ్డి 2009లో నల్లమల అడవుల్లో హెలికాప్టర్ కూలిపోవడంతో మరణించారు. అరుణాచల్ ప్రదేశ్ సీఎం దోర్జీ ఖండూ 2011లో తవాంగ్ పర్యటనలో.. హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. హర్యానా మంత్రి ఓ.పి. జిందాల్  2005లో ఉత్తరప్రదేశ్‌లో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు.   లోక్ సభ స్పీకర్ జి.ఎం.సి. బాలయోగి 2002లో  కృష్ణా జిల్లా లో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. 

కేంద్రమంత్రి మాధవరావు సింధియా2001లో ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి వద్ద జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు.  ఇందిరా గాంధీ కుమారుడు సంజయ్ గాంధీ 1980లో ఢిల్లీలో స్టంట్ ఫ్లైట్ నడుపుతూ   ప్రమాదంలో చనిపోయారు. స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1945 లో తైపీలో జరిగిన విమాన ప్రమాదంలో చనిపోగా ఇది ఇప్పటికీ వివాదాస్పదంగానే ఉంది.

ఈ ప్రమాదాలకు  ప్రధానంగా మూడు అంశాలు కారణమవుతుంటాయిని చెబుతారు.  ఒకటి వాతావరణ పరిస్థితులు. కొండ ప్రాంతాల్లో లేదా వర్షం పడుతున్నప్పుడు ప్రయాణించడం ఉదాహరణకు వైఎస్ రాజశేఖరెడ్డి, బిపిన్ రావత్ లు ప్రయాణిస్తున్న చాపర్ లు ప్రమాదానికి గురికావడానికి వాతావరణ ప్రతికూలతే కారణం.  ఇక  మరో కారణం సాంకేతిక లోపం.  విమానం లేదా హెలికాప్టర్ మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశముంది. ఇక మూడో కారణం పైలట్ నిర్ణయాలు.  అంటే  అత్యవసర పరిస్థితుల్లో తప్పుడు అంచనాలు వేయడం. దీన్నే హ్యూమన్ ఎర్రర్ గా చెబుతారు. 

తాజాగా అజిత్ పవార్ విమాన ప్రమాదానికి గల కారణాలేంటన్నది పరిశీలిస్తే..  సాంకేతిక లోపం లేదా ల్యాండింగ్ సమయంలో పైలట్ కమ్యూనికేషన్ లోపాలుగా తెలుస్తోంది. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది.