టీఆర్ఎస్ లోకి మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

 

లోక్ సభ ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ.. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య తగ్గుతూ వస్తుంది. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ని వీడి టీఆర్ఎస్ లో చేరడానికి సిద్దమవ్వగా.. ఇప్పుడు వారి బాటలోనే మరో ఇద్దరు ఎమ్మెల్యేలు క్యూ కట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఎల్బీనగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఇప్పటికే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసారని, ఒకటి రెండు రోజుల్లో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్నారని సమాచారం. దీనిపై స్పందించిన సుధీర్ రెడ్డి.. కేటీఆర్‌ను కలిసిన మాట వాస్తవమేనని క్లారిటీ ఇచ్చారు. రెండు, మూడు రోజుల్లో కేసీఆర్‌ను కూడా కలుస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్‌తో భేటీ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు ప్రకటించారు. నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసమే పార్టీ మారుతున్నట్లు వెల్లడించారు.

టీఆర్ఎస్ లోకి మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే చేరికకు కూడా రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి(జగ్గారెడ్డి) త్వరలో కారెక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి. నిన్నటినుంచి జగ్గారెడ్డి తన అనుచరులకు కూడా దొరకకుండా అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. అంతేగాక ఆయన సెల్‌ఫోన్ కూడా స్విచ్చాఫ్ చేసినట్లు తెలుస్తోంది. జగ్గారెడ్డి టీఆర్ఎస్‌లో చేరబోతున్నారనే వార్తలు ప్రసార మాధ్యమాల్లో వస్తున్నప్పటికీ ఆయన ఇంతవరకు ఖండించకపోవడంతో త్వరలోనే ఆయన టీఆర్ఎస్ లో చేరబోతున్నారని, అందుకే ఖండించట్లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ జంపింగ్ లు ఇలాగే కొనసాగితే లోక్ సభ ఎన్నికల నాటికి కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య సింగిల్ డిజిట్ కి పరిమితమయ్యే అవకాశముంది.