రోగానికి పన్నేసిన రాష్ట్ర సర్కార్‌

 

రాష్ట్ర పభుత్వం నిర్ణయాలు తుగ్లక్‌ పాలనను తలపిస్తున్నాయి. అప్పట్లో జుట్టుకు చదువుకు ఇలా రకరకాల పన్నులు ఉండేవట అని పుస్తకాల్లో మాత్రమే చదివాం. ఇప్పుడు అంతకన్నా విచిత్రమైన పన్నులను వేస్తుంది మన ప్రభుత్వం. కర్మ కాలి రోగం వచ్చినా దవాఖానాలో ఉన్నందుకు ప్రభుత్వానికి పన్ను కట్టాలంటూ కొత్త నిర్ణయం తీసుకుంది.

ఆదాయం కోసం ఇప్పటికే బాండ్లను కూడా అమ్ముకుంటున్న మన రాష్ట్ర సర్కారు ఇప్పుడు సామాన్యుడి ఆరోగ్యానికి కూడా వెలకడుతుంది. ఇతర రాష్ట్రల్లో ఎక్కడా లేని విధంగా ఐసియూ ఉన్న హాస్పిటల్స్‌ లగ్జరీ ట్యాక్స్‌ కట్టాలంటూ ప్రైవేట్‌ ఆసుపత్రులకు నోటీసుల జారీ చేసింది. ఐసియూలో ఉన్న పడకల సంఖ్యను బట్టి ఈ పన్నును నిర్ణయించారు.

దీంతో ఇక ఆ పన్నును రోగినుంచే వసూలు చేయడానికి సిద్దమవుతున్నాయి ఆసుపత్రి యాజమాన్యాలు. అసలై ప్రైవేట్‌ దవాఖానాల దోపిడితో విలవిలలాడుతున్న రోగులు ఇప్పుడు పన్ను పోటుతో మరింత కుదేలవుతున్నారు. తీవ్రమైన జబ్బులు, అరుదైన సమస్యలతో బాధపడే వారిని రోజుల తరబడి ఐసీయూలోనే ఉంచుతారు. ఇక అలాంటి వారికి వైధ్యం మరింత భారం కానుంది.