జడ్జీల పైన సోషల్ మీడియాలో కామెంట్స్ పై కేంద్ర మంత్రి సీరియస్..

ఏపీ‌లో వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలపై కోర్టుల నుండి వ్యతిరేక తీర్పులు వస్తున్నాయి. దీంతో కొద్ది రోజుల క్రితం హైకోర్టు జడ్జిల మీద కూడా కొందరు సోషల్ మీడియా వేదికగా అభ్యంతరకరమైన భాషలో విమర్శలు చేశారు. ఈ తీవ్ర విమర్శలు చేసిన వారి మీద కేసులు నమోదు చేయాలంటూ హైకోర్టు కూడా ఆదేశించింది. ఐతే ఇందులో కొందరు వైసీపీ ప్రజాప్రతినిధులు మరియు వైసీపీ కార్యకర్తలు కూడా ఉన్న విషయం తెలిసిందే. అదే సమయంలో తమ కార్యకర్తలను ఎలా కాపాడుకోవాలో తమకు తెలుసంటూ వైసీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి. అంతేకాకుండా గత ఎన్నికలలో ఓడిన టీడీపీనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుల్లో కేసులు వేయిస్తోందని కూడా వైసీపీ నేతలు ఆరోపిస్తునారు.

 

తాజాగా ఇదే విషయంపై కేంద్ర న్యాయశాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇలాంటివాటిని ఒప్పుకోబోమని అయన అన్నారు. తాజాగా ఒక జాతీయ దినపత్రికకు రాసిన వ్యాసంలో మంత్రి రవిశంకర్ ప్రసాద్ దీనిపై స్పందించారు. న్యాయవ్యవస్థ స్వయంప్రతిపత్తిని దెబ్బతీసేలా నెగిటివ్ ప్రచారం చేయడాన్ని ఈ వ్యాసం ద్వారా ఆయన తప్పుపట్టారు. ముందుగా "ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు..  పిల్ దాఖలు చేయడం, తరువాత కేసులకు సంబంధించి ఎలాంటి తీర్పు ఇవ్వాలో కూడా సోషల్ మీడియా వేదికగా జడ్జిలకు నిర్దేశించడం, ఒకవేళ తమకు వ్యతిరేకంగా తీర్పు వస్తే అదే జడ్జిల మీద దుష్ప్రచారం చేయడం" సరికాదని అయన స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌‌‌ను అభిశంసించాలన్న కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ న్యాయవాదులు చేసిన ప్రయత్నం ఈ మధ్యకాలంలో జ్యుడీషియరీ స్వయంప్రతిపత్తి మీద జరిగిన అతిపెద్ద దాడి అని అయన వ్యాఖ్యానించారు. ఈ మధ్యకాలంలో "అయితే నా మాట వినాలి. లేకపోతే బయటకు పంపేస్తాం" అనే విధానం న్యాయవ్యవస్థ స్యయంప్రతిపత్తికి పెద్ద సవాలుగా మారుతోందన్నారు. దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా బీజేపీలోని చాలా మంది నేతలు న్యాయవ్యవస్థ స్యయంప్రతిపత్తిని కాపాడుకునేందుకు ప్రయత్నించారని రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. ప్రస్తుతం న్యాయవ్యవస్థ పైన పెరుగుతున్న దాడి తమను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందన్నారు.