Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సిరిమల్లె పువ్వల్లే నవ్వు...
posted on: Aug 27, 2018 11:52AM

"నవ్వు నాలుగు విధాలుగా చేటు" అనేది పాత సామెత. "నవ్వు అనేక విధాలుగా మేలు" అనేది నేడు నిరూపించబడ్డ సత్యం. అయితే ఆ నవ్వుకే మనం దూరమైపోతున్నాం రోజు రోజుకి. రెండు నెలల పసిపాపగా ఉన్నప్పుడు రోజుకి ౩౦౦ సార్లకి పైగా నవ్వుతాం మనం. కానీ పెరిగే కొద్దీ ఆ నవ్వుల సంఖ్య కొంచం కొంచం తగ్గి పెళ్ళి, పిల్లలు, ఉద్యోగ బాధ్యతలలో పడ్డాక రోజుకి ఒక్కసారి మనస్పూర్తిగా నవ్వటం కూడా కష్టంగా మారిపోతుంది. దీంతో మనకి మనమే నష్టం చేకూర్చుకున్న వాళ్ళం అవుతున్నాం. ఎందుకంటే నవ్వటం వల్ల శరీరమంతా విశ్రాంతి పొందుతుంది. ఒకసారి మనసారా నవ్వితే కండరాలన్నీసడలి, మానసిక ఒత్తిడి శారీరక టెన్షన్ తగ్గుతాయి. ఒక్క నిమిషం మనసారా నవ్వినా చాలు దాని ప్రభావం సుమారు 45 నిమిషాలదాకా మన శరీరం పై నిలుస్తుందిట. మరిప్పుడు చెప్పండి. నవ్వు తప్పనిసరా కాదా?
ఓ చిన్న ప్రశ్న. మీరు బాగా నవ్వి ఎన్నిరోజులయ్యింది? పోనీ, కాస్త నవ్వి ఎన్నిరోజులయ్యింది. గుర్తుకు రావటం లేదు కదూ! మీరే కాదు. నన్ను ఆ ప్రశ్న అడిగినా నేనూ ఆలోచించాల్సిందే. ఎందుకంటే చాలు మనందరం మన మన బాధ్యతల నిర్వహణలో బిజీగా మారిపోయి ఆ నవ్వుని ఎక్కడో జారవిడుచుకున్నాం. అమూల్యమైన ఆ సంపద మన దగ్గరుంటే చాలు ప్రపంచంలో దేనినైనా స్వంతం చేసుకోగలం మనం. కానీ దానినే జారవిడుచుకుని, ఎంత సంపాదించినా, ఎన్ని సాధించినా నిజమైన ఆనందం కలగటం లేదని వాపోతున్నాం. నిజానికి నవ్వుల్లో తేలిపోయే వ్యక్తి మనస్సు, శరీరం ఎంతో ఉత్తేజాన్ని పొందుతాయి. కష్టాలు, అసంతృప్తి వంటివి ఎదురయినప్పుడు కూడా స్థిరంగా ఉండగలం. జీవితం పట్ల ఆశావహ దృక్పథాన్ని కలిగి వుంటాం. ఇదంతా కేవలం నవ్వు వల్ల సాధ్యమయ్యే అద్భుతాలు.
నవ్వును మరిచిపోయి జీవించటమే రోగాలకు మూలమంటున్నారు. మానసిక విశ్లేషకులు. ఎందుకంటే నవ్వటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఒత్తిడి కలిగించే హర్మోన్లు తగ్గిపోతాయి. అలాగే నవ్వినప్పుడు ఆనందానికి కారణమయిన సహజసిద్ధమయిన రసాయనాలు, ఎండార్ఫిన్స్ చక్కగా విడుదల అవుతాయి. అప్పుడు శారీరం, మనస్సు తేలికయి సంతోషం కలుగుతుంది. అందుకే చూడండి కడుపారా నవ్వాకా అప్పటి వరకు ఉన్న బరువేదో దిగిపోయినట్టు అనిపిస్తుంది. సంతోషం ఉరకలు వేస్తుంది. అప్పటి వరకు మనల్ని చిరాకు పెట్టిన విషయాలు కూడా చిన్నవిగా తోస్తాయి. కోపం, విచారం దూరమవుతాయి. ఇదంతా కేవలం ఒక్క నవ్వు వల్లే సాధ్యం.
మీకు తెలుసా... వ్యాయామం చేసినా, హాయిగా నవ్వినా కలిగే ప్రభావం,ప్రయోజనం ఒకటేనట. మనస్పూర్తిగా నవ్వినప్పుడు మానసిక ఆనందం కలుగుతుంది. ముఖంలో, శరీరమంతటా కండరాలు బాగా కదులుతాయి. నాడీ స్పందనలు అధికమవుతాయి. రక్తప్రసరణ వేగవంతమవుతుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరిగి కణజాలానికి ఎక్కువగా ఆక్సిజన్ అందుతుందిట. శరీరం అంతా ఆ నవ్వు ప్రభావం ఉంటుంది. ఒకసారి నవ్వితే పదినిమిషాలు జాగింగ్ చేసిన దాంతో సమానం అని తేలింది ఓ పరిశోధనలో. ఈ నవ్వుపై పరిశోధనలు చేసిన మేరిలాండ్ యూనివర్సిటి పరిశోధకులు "నవ్వు ఉత్తమ ఔషధం అన్న మాట నిజమేనని అది గుండెను పదిలంగా ఉంచుతుందని" చెబుతున్నారు.
"లాఫింగ్ థెరపి" అంటే "నవ్వు చికిత్స" తనని భయంకరమైన క్యాన్సర్ వ్యాధి బారి నుంచి కాపాడిందని చెప్పారు న్యూయార్క్ టైమ్స్ మాజీ సంపాదకులు నార్మన్ కుజిన్స్. కాబట్టి నవ్వు నాలుగు విధాల కాదు నాలుగు వేల రకాలుగా మంచిదని నమ్మితీరాలి. నవ్వటం మొదలుపెట్టాలి. మరి నవ్వటం మొదలు పెడతారు కదూ! నవ్వటం కష్టమనకండి. ఆ కష్టం కరగాలంటే నవ్వాలి మరి. సో మీ మనసుని, మెదడుని నవ్వుకి ట్యూన్ చేసేయ్యండి. ఆరోగ్యంగా, ఆనందంగా ఉండండి. సరేనా. మరి ఏదీ నా కోసం ఒక్క చిరునవ్వు? అదీ... అలా కంటిన్యూ అయిపోండి.
-రమ ఇరగవరపు






