TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

'చిత్ర' భళారే విచిత్రం.. ఆమె అరెస్ట్‌.. అత‌నే యోగి.. కాస్త‌ క్లారిటీ!

Published on: Wed Mar 9, 2022 5:07PM

ఆమె NSE మాజీ సీఈవో. అత‌ను హిమాల‌య యోగి. ఇద్ద‌రి మ‌ధ్య న‌డిచింది ఓ అదృశ్య స్టోరీ. ఆ మిస్ట‌రీ డ్రామాపై ఇప్పుడిప్పుడే క్లారిటీ వ‌స్తోంది. సీబీఐ విచార‌ణ‌లో చిత్ర గుట్టు ర‌ట్టైంది. ఆ అదృశ్య‌ యోగి ఎవ‌రో తేలిపోయింది. అయినా, ఇత‌నే అత‌న‌ని ఒప్పుకోవ‌డం లేదు చిత్ర‌. అందుకే, ఏడు రోజుల క‌స్ట‌డీలో మ‌రింత లోతుగా ద‌ర్యాప్తు చేస్తోంది సీబీఐ. 

కో-లొకేషన్‌ కుంభకోణం కేసులో అరెస్టయిన నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ-NSE మాజీ సీఈఓ చిత్రా రామకృష్ణను సీబీఐ అధికారులు గ‌ట్టిగా ప్ర‌శ్నిస్తున్నారు. ఇప్ప‌టికే ఆమెను ప్ర‌త్యేక కోర్టులో హాజ‌రుప‌ర‌చ‌గా.. విచారణకు చిత్ర సహకరించడం లేదని, ‘హిమాలయ యోగి’ని గుర్తుపట్టేందుకు ఆమె నిరాకరిస్తున్నారని సీబీఐ కోర్టుకు తెలిపింది. ద‌ర్యాప్తులో చిత్ర‌ మాజీ స‌ల‌హాదారు ఆనంద్ సుబ్ర‌మ‌ణియ‌నే హిమాల‌య యోగిగా గుర్తించారు సీబీఐ అధికారులు. 2013-16 మధ్య కాలంలో చిత్రా రామకృష్ణన్‌తో సమాచారం పంచుకున్న ఈ-మెయిల్‌ ఐడీని సుబ్రమణియన్‌ సృష్టించినట్టు సీబీఐ వర్గాలు ధ్రువీకరించాయి. 

"చిత్ర రామకృష్ణ, ఆమె మాజీ సలహాదారు ఆనంద్‌ సుబ్రమణియన్ మ‌ధ్య‌ దాదాపు 2500 ఈ-మెయిళ్లు నడిచినట్లు గుర్తించాం. విచారణలో భాగంగా చిత్ర.. ఆనంద్‌ను ఎదురెదురుగా ఉంచి ప్ర‌శ్నించాం. అయితే అతడిని గుర్తుపట్టేందుకు ఆమె నిరాకరించారు" అని సీబీఐ కోర్టుకు వెల్లడించింది. విచారణలో ఆమె సరిగ్గా సమాధానం ఇవ్వలేదని, అందుకే అరెస్టు చేయాల్సి వచ్చిందని సీబీఐ తెలిపింది.   

ఇంత‌కీ ఎవ‌రీ చిత్ర‌? ఎవ‌రీ హిమాల‌య యోగి? వారి మ‌ధ్య‌ అదృశ్య స్టోరీ ఏంటంటే....

చిత్రా రామకృష్ణ. నేష‌న‌ల్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌-NSE ఎండీ, సీఈవో. 2013లో ఫోర్బ్స్‌ మ్యాగజీన్‌ ‘విమన్‌ ఆఫ్ ది ఇయర్‌’ ఆమె. భారత్‌లో రెండో శక్తిమంతమైన మహిళా వ్యాపారవేత్త. ఇదంతా గ‌తం. ఇప్పుడామె సెబీ విచార‌ణ‌ను ఎదుర్కొంటున్నారు. ఆమెపై నిషేధ‌మూ ఉంది. శాల‌రీలో కొంత భాగం ఆపేశారు. ట్రేడింగ్ సామ్రాజ్యాన్ని ఏలిన ఆమె.. ఇప్పుడిలా దోషిలా నిల‌బ‌డ‌టానికి కార‌ణం.. ఓ హిమాల‌య యోగి. ఆమె చెబుతున్న 'అదృశ్య' స్టోరీ. 

చిత్రా కెరీర్‌ ఛార్టెర్డ్‌ అకౌంటెంట్‌గా స్టార్ట్ అయింది. 1985లో ఐడీబీఐ బ్యాంక్‌కు చెందిన ప్రాజెక్ట్‌ ఫైనాన్స్‌ డివిజన్‌లో చేరారు. ఆ త‌ర్వాత కొంతకాలం సెబీలో పనిచేసి.. మ‌ళ్లీ ఐడీబీఐ బ్యాంక్‌కు తిరిగొచ్చారు. బీఎస్‌ఈలో హర్షద్‌ మెహతా కుంభకోణం తర్వాత.. పారదర్శక ట్రేడింగ్ కోసం కేంద్రం ఐదుగురితో ఎన్ఎస్ఈ ఏర్పాటు చేయ‌గా.. అందులో చిత్ర రామకృష్ణ ఒకరు. 2009లో చిత్ర.. NSEకి ఎండీగా బాధ్యతలు చేపట్టారు. 2013లో NSE సీఈఓగా ఎదిగారు. 

20 ఏళ్ల‌ పాటు ఎన్‌ఎస్‌ఈకి వ‌ర్క్ చేసిన చిత్ర.. 2016 డిసెంబరులో అనూహ్యంగా ఎండీ, సీఈఓ పదవికి రాజీనామా చేశారు. అదే స‌మ‌యంలో ఆమెపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీంతో సెబీ ఆమెపై చర్యలు చేపట్టింది. ఇక‌, చిత్ర రామకృష్ణ హయాంలో NSE చీఫ్‌ స్ట్రాటజిక్‌ అడ్వైజర్‌గా ఆనంద్‌ సుబ్రమణియన్‌ను నియమించడం.. కొంత‌కాలానికే ఆయ‌న్ను గ్రూప్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌, ఎండీ సలహాదారుగా మార్చడం అనుమానాస్ప‌దంగా మారింది. ఇక‌, సెబీ, సీబీఐ ద‌ర్యాప్తులో మ‌రిన్ని సంచ‌న‌ల విష‌యాలు వెలుగుచూశాయి. చిత్ర గత 20 ఏళ్లుగా ఓ ‘అదృశ్య’ యోగి ప్రభావానికి లోనైనట్టు తెలిసింది. హిమాలయాల్లో ఉండే ఆ యోగితో ఎన్‌ఎస్‌ఈకి సంబంధించిన కీలక విషయాలను పంచుకుని ఆయన నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నట్టు గుర్తించారు. 
 
ఆ యోగి చెప్పార‌నే.. ఆనంద్ సుబ్ర‌మ‌ణియ‌న్‌ను ఎన్ఎస్ఈలో ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు. అంత‌కుముందు ఆనంద్‌ జీతం 15లక్షలు ఉండ‌గా.. ఎన్‌ఎస్‌ఈలో ఏకంగా 1.38 కోట్ల ప్యాకేజీ ఇచ్చారు. ఆ తర్వాత ఇన్ ఇయ‌ర్‌కే అతడి శాల‌రీ 20శాతం పెంచేశారు. వారానికి 3 రోజులు మాత్రమే వ‌ర్కింగ్ డేస్‌గా వెసులుబాటు కూడా క‌ల్పించారు. ఇదంతా ఆ హిమాల‌య‌ యోగి చెప్పినందుకే.. చిత్ర రామ‌కృష్ణ‌.. ఆనంద్ సుబ్ర‌మ‌ణియ‌న్‌కు అలాంటి బంప‌ర్ ఆఫ‌ర్స్ ఇచ్చార‌ని సెబీ దర్యాప్తులో తేలింది.   
 
ఇంత‌కీ ఆ హిమాల‌య యోగ ఎవ‌రు? ఆయ‌న‌తో చిత్ర‌కు ఎలాంటి సంబంధం ఉంద‌నేది మ‌రింత ఆస‌క్తిక‌రం. ఆ యోగి ఓ నిరాకారుడని, సిద్ధ పురుషుడు, శిరోణ్మని అని చిత్ర చెప్పారు. తన వృత్తి, వ్యక్తిగత విషయాల్లో ఆయన నుంచి ఏళ్లుగా స‌ల‌హాలు, సూచ‌న‌లు తీసుకుంటున్న‌ట్టు వెల్ల‌డించారు. ఆ యోగికి భౌతిక రూపం అంటూ ఏదీ లేదని, ఆయన ఎలా కావాలంటే అలా మారుతార‌ని.. ఆయ‌న హిమాల‌య ప‌ర్వ‌తాల్లో ఉంటార‌ని.. చిత్ర విచార‌ణ‌లో తెలిపారు. 

అయితే, దర్యాప్తులో ఆ అదృశ్య యోగి.. మనిషేనని తేలింది. ఆ యోగికి, చిత్ర‌కు, ఆనంద్‌ సుబ్రమణియన్‌కు ఎలాంటి లింక్ ఉంద‌ని ఆరా తీసింది. ఇక‌, ఆ యోగితో చిత్ర ఈ-మెయిల్ సంభాష‌ణ‌లు కూడా జ‌రిపార‌ని గుర్తించారు. వారిద్ద‌రి మ‌ధ్య న‌డిచిన మెయిల్స్‌లో ప‌లు ఇంట్రెస్టింగ్ విష‌యాలు ఉన్నాయి. ఎన్‌ఎస్‌ఈ మాజీ సీఈఓ, ఎండీ చిత్రా రామకృష్ణకు ఆధ్యాత్మిక గురువుగా వ్యవహరించిన ఆ యోగి.. ఆమె శిరోజాలపై ఆసక్తి చూపారు. జడను వేర్వేరు రకాలుగా వేస్తే ఇంకా బాగుంటావనీ ఆమెకు సూచించారు. ఆమెకు కొన్ని పాటలు షేర్ చేశారు. ఇద్దరూ కలిసి సీషెల్స్‌కు వెళ్లారనీ తెలిసింది.  

2015 ఫిబ్రవరి 18న చిత్రారామకృష్ణకు ఆ వ్యక్తి పంపిన ఇ-మెయిల్‌లో "ఇవాళ నీవు చాలా బాగున్నావు. నీ శిరోజాలుగా వివిధ రకాలుగా అలంకరించుకోవడం నేర్చుకోవాలి. అప్పుడు మరింత చూడముచ్చటగా ఉంటావు. ఉచిత సలహానే అయినా, దీన్ని నువ్వు స్వీకరిస్తావని తెలుసు" అని ఉంది. అంతకు ముందు రోజు ఈ-మెయిల్‌లో.. "నీ బ్యాగులు సిద్ధం చేసుకో. వచ్చే నెల సీషెల్స్‌కు వెళ్లడానికి ప్రణాళికలు వేస్తున్నా. నీకు వీలుంటే నాతో రావొచ్చు. మనం వెళ్లేదారిలో హాంకాంగ్‌ లేదా సింగపూర్‌లో ఆగొచ్చు. నీకేదైనా సహాయం కావాలంటే చెప్పు. నీకు ఈత తెలిస్తే సముద్ర స్నానం చేయొచ్చు".. అంటూ ఆ మెయిల్‌లో రాసుంది. 

2015 సెప్టెంబరు 16 నాటి ఈ-మెయిల్‌లో ఇలా ఉంది.. "నేను పంపిన మకర కుండల పాట విన్నావా? వాటిని కచ్చితంగా వినాలి. నీ మది నుంచి నీ మోముపైకి వచ్చే చిరునవ్వును చూస్తున్నపుడు నాకు ఆనందంగా ఉంటుంది. నిన్న సమయాన్ని పంచుకోవడం సంతోషంగా ఉంది. నీకోసం నువ్వు చేసే ఈ చిన్నచిన్న విషయాలు నిన్ను శక్తిమంతంగా, తక్కువ వయస్సు అనిపించేలా చేస్తుంది" అని రొమాంటిక్ యాంగిల్‌లో ఉంది ఆ మెయిల్ సారాంశం. 

ఇలా చిత్ర రామ‌కృష్ణ ఈ-మెయిల్స్ ప‌రిశీలించిన ద‌ర్యాప్తు బృందం.. ఆమె చెబుతున్న‌ట్టు అత‌ను అదృశ్య యోగినో.. హిమాల‌య యోగినో కాద‌ని నిర్ధారించింది. మ‌రింత లోతుగా ద‌ర్యాప్తు చేస్తే.. ఆ యోగి.. ఆమె స‌ల‌హాదారు ఆనంద్ సుబ్ర‌మ‌ణియ‌న్ అని తేలింది. చిత్ర‌నే ఇలా అదృశ్య డ్రామా ప్లే చేస్తోందా? ఆమె క్లారిటీతోనే ఉందా? అనే కోణంలో సీబీఐ విచారిస్తోంది. ఇంత జ‌రిగినా.. ఈ ఆనంద్‌.. ఆ యోగి ఒక్క‌రు కాదు అంటోంది చిత్ర. బ‌హు చిత్ర విచిత్రంగా న‌డుస్తోంది ఈ అదృశ్య‌ స్టోరీ.