అలీకి రాజ్యసభ కాదట..అదట! పోసానికీ ఉందట!.. సినిమా చూపిస్తున్న జగనన్న..
Published on: Wed Feb 16, 2022 2:14PM
గుర్తుండే ఉంటుంది. ఇంచుమించుగా ఒక నెల, నెలన్నర రోజుల క్రితం మెగా స్టార్ చిరంజీవికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నుంచి విందుకు రమ్మని ఆహ్వానం అందింది. మెగాస్టార్, మహదానందంగా వెళ్ళారు. ముఖ్యమంత్రితో కలిసి కూర్చుని లంచ్ చేశారు. అయితే, చిరంజీవి వెళ్ళింది కేవలం లంచ్ చేసేందుకే కాదు, సినిమా పరిశ్రమ సమస్యలు, ముఖ్యంగా సినిమా టికెట్ల వివాదం విషయం చర్చిందేందుకే ముఖ్యమంత్రి ఆయన్ని పిలిచారు, అందుకోసమే ఆయన వెళ్ళారు. అయితే, లోపల ఆ ఇద్దరు ఏమి చర్చించుకున్నారో, ఏమో కానీ, ఆయన బయటకు వచ్చేసరికి, సినిమా టికెట్ గోల పక్కకు పోయి, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, చిరంజీవికి రాజ్యసభ టికెట్ ఇచ్చారని,ఇస్తారని ప్రచారం జరిగి పోయింది. చిరంజీవి కొంత బద్నాం అయ్యారు. పబ్లిక్’లో ఆయన ఇమేజ్’ ‘ఛీ’ స్థాయికి చేరి పోయింది. ఆ తర్వాత చిరంజీవి, ముఖ్యమంత్రి అలాంటి ఆఫర్ ఏదీ ఇవ్వలేదని, ఇచ్చినా తాను పుచ్చుకోనని అన్నారు.
ఇక అక్కడి నుంచి, ఏపీ రాజకీయాల్లో, ముఖ్యంగా వైసీపీ, సినిమా ఇండస్ట్రీ సంబందాల విషయంలో ఏదో ‘టాక్ ట్రాక్’ నడుస్తూనే ఉంది. సంచలనం అవుతూనే వుంది. సర్కా ర్’కు ఇండస్ట్రీలో ఒక వర్గం జీ హుజూర్ అయిపోయిందనే మాట వినిపిస్తూనే వుంది. చివరకు ప్రతిపక్ష నేత నేత చంద్రబాబు నాయుడు కూడా, సర్కార్ సినిమా సంబంధాలపై స్పదించారు. మరీ ఇంతలా దిగజార వలసిన అవసరం ఏముందని, ‘స్టార్స్’కు చురకలు అంటించారు. ఇంత అహంకారం ఎందుకని ముఖ్యమంత్రికి వాతలు పెట్టారు.
అదలా ఉంటే, తాజాగా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, కమెడియన్ అలీని తెర మీదకు తెచ్చారు. చిరంజీవిని పిలిచినట్లే ఆలీనీ ‘ఏకాంత’ చర్చలకు ఆహ్వానించారు. అలీలోనూ రాజ్యసభ ఆశలు చిగురించాయి. నిజానికి ఆలీ చాలా కాలంగా రాజకీయాలలో, అంటే వైసీపీలో ఉన్నారు . గత అసెంబ్లీ ఎన్నికల్లోనే గుంటూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారని అన్నారు. అయన పోటీ చేయలేదు కానీ, వైసీపీలో కొనసాగుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే తాజా ఎపిసోడ్’లో నిన్న మొన్నటిదాకా ఆయనకు రాజ్యసభ సీటు గ్యారెంటీ అన్న ప్రచారం సాగింది. అయితే ఇప్పడు సీన్’ మారిందని అంటున్నారు.
కమేడియన్’కు అంత పెద్ద పోస్టు ఎందుకు అనుకున్నారో ఏమో కానీ, ఇప్పుడు ఏపీ వక్ఫ్ బోర్డు ఛైర్మన్ పోస్టుతో సరి పెట్టాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అలీతో పాటు, మరో కమెడియన్ పోసాని కృష్ణమురళికి సైతం జగన్ ఏదో ఒక పోస్టు ఇస్తారని అంటున్నారు. నిజానికి అలీ కంటే.. జగన్’ ను గట్టిగా సమర్ధించింది, ఘనంగా నష్టపోయింది, పోసానే అంటారు. జగన్ కోసం పవన్ కళ్యాణ్ మీద రెచ్చిపోయి విమర్శలు చేశారు, ఫలితంగా ఆయనకు ఆఫర్లు రావడంలేదని ఆయనే చెప్పారు. ఈ పరిస్థితిలో ఈ ఇద్దరు కమెడియన్స్’ కు జగన్ కామెడీ పాత్రలే ఇస్తారో ఇంకే పాత్రలు ఇస్తారో చూడవలసి వుందని అంటున్నారు. మొత్తానికి సినిమా వాళ్ళకు జగన్ రెడ్డి సినిమా చూపిస్తున్నారు. అయితే సినిమా అభిమానులు మాత్రం సినీ హీరోల పరిస్థితి, ‘ఇంత బతుకు బతికి . ..ఇంటి వెనకాల ఏడ్చినట్లు’ ఉందని అంటున్నారు.


