కొబ్బరిబొండాల్లో మద్యం.. నటి గాయత్రి డెత్ కేసులో అప్‌డేట్
Published on: Sat Mar 19, 2022 6:01PM
హోలీ రోజు. జిల్ జిల్ జిగా అంటూ పార్టీ చేసుకున్నారు. రంగులతో కాదు మందుతో. అమ్మాయిలు.. అబ్బాయిలు. అంతా కలిసి ఫుల్‌గా తాగారు. తాగి పబ్బు కెళ్లి మరింత మందేసి చిందేశారు. పబ్ నుంచి బయటకు వచ్చేసరికి తాగిందంతా దిగిపోయింది. మళ్లీ మందేశారు. ఈసారి కొబ్బరిబోండాల్లో వోడ్కా కలుపుకొని తాగేశారు. తాగినోళ్లు అన్నీమూసుకొని ఇంట్లో కూర్చోవచ్చుగా? మద్యం మత్తులో కారేసుకొని రోడ్డు మీద పడ్డారు. కిక్కు తలకెక్కి.. కారు కంట్రోల్ తప్పి.. ఇద్దరి ప్రాణాలు తీశారు. మరొకరు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు. ఈ ఘటనలో యూట్యూబర్, షార్ట్ ఫిల్మ్స్ నటి గాయత్రి దుర్మరణం చెందగా.. కేసు విచారణ కొనసాగుతోంది.
గచ్చిబౌలిలో కారు ప్రమాద ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. హోలీ పండుగ రోజు జరిగిన రోడ్డు ప్రమాదం విషాదం నింపింది. విప్రో జంక్షన్ నుంచి గచ్చిబౌలి వైపు ప్రయాణిస్తున్న కారు మితిమీరిన వేగంతో కంట్రోల్ తప్పి.. రోడ్డు పక్కన చెట్లకు నీరు పోస్తున్న మహేశ్వరి అనే మహిళను ఢీకొట్టింది. ఆమె స్పాట్ డెడ్. అదే వేగంతో వెళ్లి ఫుట్‌పాత్‌పై కారు బోల్తా పడింది. యాక్సిడెంట్ దాటికి కారు అద్దాలు పగిలి.. లోపల కూర్చున్న నటి గాయత్రి ఎగిరొచ్చి రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడింది. ఆమెను హాస్పిటల్‌కు తరలిస్తుండగా చనిపోయింది. కారు నడుపుతున్న రోహిత్‌కు తీవ్ర గాయాలు కావడంతో కోమాలోకి వెళ్లాడు. అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.
రోహిత్.. స్నేహితులు కలిసి మద్యం తాగినట్లు పోలీసులు గుర్తించారు. హోలీ రోజు స్నేహితుడి రూమ్‌లో రోహిత్, గాయత్రి, మరో ఐదుగురు పార్టీ చేసుకున్నారు. అనంతరం కొబ్బరిబొండాల్లో మద్యం నింపుకొని కారులో పెట్టుకున్నారు. ఓ పబ్‌లో ఫుల్‌గా ఎంజాయ్ చేసొచ్చాక.. ఆ కొబ్బరిబొండాల్లోని మద్యం తాగారు. అలా ఆరు కొబ్బరిబొండాల్లోని మందంతా తాగేశారు. మిగిలిపోయిన మరో 2 కొబ్బరి బొండాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు ఎంతగా చెకింగ్స్ చేస్తున్నా.. ఎంతగా అవగాహన కల్పిస్తున్నా.. యువత ఇలా తప్ప తాగి.. రోడ్డెక్కి.. వాహనం నడుపి.. చావులకు కారణమవుతుండటం దారుణమైన విషయం. గచ్చిబౌలి ప్రమాదంతో షార్ట్ ఫిల్మ్స్ యాక్ట్రెస్ గాయత్రి చనిపోవడం విషాదకరం.


