వై.ఎస్. ఆనవాళ్ళను కాంగ్రెస్ చెరిపేయగలదా?
Published on: Tue Jul 17, 2012 12:46PM
దివంగత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ పార్టీ కన్నా వ్యక్తిగతంగా సంపాదించుకున్న ఇమేజ్ ప్రజల్లో నాటుకు పోయింది. ఏ సంక్షేమ పథకం ఆయన ప్రకటించినా అది కాంగ్రెస్ పార్టీ రూపొందించినది కాదని, వైఎస్ సొంతంగా ఈ పథకాన్ని రూపొందించారని ప్రచారం జరిగింది. దీంతో కాంగ్రెస్ పార్టీ కన్నా వైఎస్‌కు ప్రజల్లో సంక్షేమపథకాల నిర్మాతగా ముద్రపడిరది. ఆ ముద్ర ఇప్పుడు ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహనరెడ్డికి లాభిస్తోంది. వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ అమలు చేయాలని వై.కా.పా. అధ్యక్షుడు జగన్ పలుమార్లు డిమాండు చేశారు. దీంతో కాంగ్రెస్ జాతీయ స్థాయిలో అమలు చేసే ఏ సంక్షేమ పథకమైనా రాష్ట్రంలో మాత్రం వైఎస్ ముద్రను సొంతం చేసుకున్నాయి. ఇటీవల మంత్రి ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలోని మంత్రివర్గకమిటీ కూడా ఈ విషయాన్ని గమనించింది.
జగన్ తొలిసారి ఈ ముద్రను వేసినప్పుడే తిప్పికొట్టి ఉంటే బాగుండేదని, ఇప్పుడు ప్రజలకు దీని గురించి వివరించటం చాలా కష్టమని కాంగ్రెస్ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. అయితే ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీ రూపొందించిన సంక్షేమ పథకం ఇది అని వివరిస్తూ వైఎస్ కూడా తనలాగే ముఖ్యమంత్రిగా పని చేశారు కాబట్టి దాన్ని అమలు చేశారని విశదీకరిస్తున్నారు. ఇంత సుదీర్ఘ విశదీకరణ అన్ని ప్రాంతాల్లోనూ ఆయన చెప్పగలరా? ఆ ముద్రను చెరపటం అంత సులభమా?
ముద్ర చెరపటమే అంత సులభమైతే ఉప ఎన్నికల్లో ఓటమి తప్పేదని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. అలానే వైఎస్ హయాంలో ఆగిపోయిన సగం ప్రాజెక్టులను ఇప్పుడు పూర్తి చేయటం ద్వారా అది తమ పార్టీ రూపొందించినది అని తెలియజేయాలని సూచనలు వస్తున్నాయి. అవసరమైతే లబ్దిదారులకు మళ్లీ మంజూరులు చేయటం ద్వారా కూడా కాంగ్రెస్ పార్టీ సంక్షేమ కార్యక్రమమన్న అభిప్రాయాన్ని కల్పించాలని ప్రభుత్వానికి పలువురు సూచిస్తున్నారు. ఏమైనా వైఎస్ ముద్ర మాత్రం కాంగ్రెస్‌ను భయపెడుతోంది.


