పోరుబాటలో ఓపెన్ కాస్ట్ నిర్వాసితులు
Published on: Fri Aug 17, 2012 8:22AM
ఓపెన్‌కాస్టు గనులు సృష్టిస్తున్న విధ్వంసంతో పాటు నిర్వాసితులైన వేలాది మంది ప్రజలకు ఇంతవరకు ఎలాంటి నష్టపరిహారం అందలేదు. అరకొరగా ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలు కనీసవసతులు లేక ఆధ్వాన్నంగా ఉన్నాయి. ఆదిలాబాద్, కరీంనగర్,వరంగల్, ఖమ్మం జిల్లాలలోని నిర్వాసితులు పోరాటాలకు దిగుతున్నారు. అదే సమయంలో ఓపెన్ కాస్ట్ కు తమ భూములను ఇచ్చే ప్రసక్తి లేదని తెగేసి చెబుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని 12 గ్రామాలు ఖమ్మంజిల్లాలోని ఎనిమిది గ్రామ ప్రజలకు పరిహారం సక్రమంగా అందచేయలేదని ప్రజలు చెబుతున్నారు.
ఆదిలాబాద్‌లో ఓపెన్ కాస్ట్ కోసం 350 ఎకరాల భూమి అప్పచెప్పారు. ఎలాగూ ఈ గ్రామం ఓసీ కింద పోతుంది కదా అని ఆరేళ్లనుండీ ఇక్కడ అభివృద్ది పనులు చేపట్టటం లేదు. శ్రీరాంపురం ఓపెన్ కాస్టు గనిలో తాళ్లపల్లి గ్రామస్తుల భూములన్నీ పోయాయి. వీరికి ఇప్పటివరకు పునరావాసం ఏర్పాటు చేయలేదు. ఇంకా 4 కోట్ల పరిహారం ప్రభుత్వం చెల్లించవలసి ఉంది. వీటిక్రింద భూములు కోల్పోయిన వారు 4500 మంది ఉన్నారు. 4 వేల ఎకరాల వ్యవసాయ భూమి పోయింది. చుట్టుప్రక్కల 2 వేల ఎకరాల్లో పంటలు పండని స్థితి నెలకొంది. ఓపెన్‌కాస్టు త్రవ్వకాల మూలంగా ఇళ్లు పాడయ్యాయి. మట్టి పెళ్లలు పడి పిల్లలు చనిపోయారు. తిర్యాణి మండలంలో నిర్వాసితుల కోసం ఏర్పాటు చేసిన కాలనీలు ఆద్యాన్నంగా ఉన్నాయి. ఎలాంటి సౌకర్యాలు లేవు. మొబైల్‌వైద్యం ప్రహసనంగా మారింది. పునరావాసం కోసం యాజమాన్యం కోట్ల నగదును ప్రభుత్వం వద్ద డిపాజిట్ చేసినప్పటికీ నిర్వాసితులకు సంవత్సరాలు గడుస్తున్నా ఎలాంటి సహాయం అంద చేయటం లేదు. యాజమాన్యాలు పని కల్పించడంలోనూ విఫలం చెందుతున్నాయి. లారీలలో లెవలింగ్ చేసే పనులుకూడా తమకు అప్పగించడంలేదని నిర్వాసితులు వాపోతున్నారు. కొందరికే పరిహారం చెల్లించారు. పునరావాస కేంద్రాలలో ఇళ్లు వేయలేదు. వైద్య సౌకర్యాలు లేవు. పాఠశాలల ఊసే లేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు. 18 ఏళ్లు నిండిన వారికి పునరావాసం తో పాటు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నా ఇంతవరకు అతీగతీ లేదని ప్రజలు వాపోతున్నారు. అందువల్లే తాము పోరాటానికి సిద్దమయ్యాం అని తెలిపారు.


