గంటల్లో రూ. 2 వందల కోట్లు హాంఫట్! అధికార పార్టీ ముఖ్య నేత డీల్?  

రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావొచ్చా? కొన్ని గంటల్లోనే వందల కోట్ల రూపాయలు సంపాదించడం సాధ్యమా?. మాములుగా అయితే ఎవరికి ఇది సాధ్యం కాదు. కాని రాజకీయ నేతలకైతే అది చిన్న పనిగానే ఉంటుందట. అధికారంలో ఉన్న నేతకు సన్నిహితంగా ఉంటే ఇంకా ఈజీనట. పాలించే నేతకు దగ్గరి బంధువైతే ఇక తిరుగేలేదట. రాత్రికి రాత్రే వందల కోట్ల రూపాయలు ఇట్టే స్వాహా చేయవచ్చట. ఇందుకు పెద్దగా కష్టపడాల్సిన పని కూడా లేదట. మాయా మశ్చీంద్రలు చేయాల్సిన అవసరం రాదట. అలా పలకగానే ఇలా  డబ్బులు వచ్చిపడటానికి అల్లావుద్దీన్ అద్బుత దీపం ఉండాల్సిన అవసరం కూడా లేదట. కేవలం అధికారాన్ని ఉపయోగించి అక్రమ మార్గంలో నిమిషాల్లో  వందల కోట్ల రూపాయలు కొట్టేయవచ్చని తెలుస్తోంది. 

 

తెలంగాణ రాజధాని హైదరాబాద్ ఇలాంటి దందాలకు అడ్డాగా మారిపోయిందని తెలుస్తోంది. హైదరాబాద్ కు మణిహారంగా ఉన్న అవుటర్ రింగ్ రోడ్డు చుట్టూ ఉన్న భూములపై కన్నేసిన బడాబాబులు.. అడ్డదారుల్లో వాటిని రాత్రికి రాత్రే సొంతం చేసుకుంటున్నారట. ఖరీదైన ఏరియాలో భూములున్న వ్యక్తులను గుర్తించి.. తమకున్న అధికారంతో వారిని భయపెట్టి, బెదిరింది లొంగదీసుకుంటున్నారట. అయినా వినకపోతే అ భూములపై వివాదం స్పష్టించి.. పోలీసుల కేసులతో వేధించి తమ దారికి తెచ్చుకుంటున్నారట. అత్యంత ఖరీదైన భూములను కారు చౌకగా వారి దగ్గర కొట్టేసి.. కొన్ని గంటల్లోనే అంతకు పదుల రెట్లకు అమ్ముకుంటూ వందల కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారట. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇలాంటి ఘటన ఇటీవలే జరిగిందని తెలుస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓ ప్రముఖ పార్టీ నుంచి పోటీ చేసిన ఓ బడా వ్యాపారి కమ్ రాజకీయ నేతకే మైండ్ బ్లాక్ అయ్యిందట. 

 

మేడ్చల్ జిల్లా పరిధిలో హైదరాబాద్ శివారు అవుటర్ రింగ్ రోడ్డుకు ఆనుకుని ఆ  బడా వ్యాపారవేత్తకు 3 వందల ఎకరాల భూమి ఉందట. ఆ భూములపై  అధికార పార్టీలోని ముఖ్య నేత బంధువు కన్ను పడిందట. ప్రజాప్రతినిధిగానూ ఉన్న ఆ బడా నేత.. అ వ్యాపారి భూముల కోసం కతర్నాక్ స్కెచ్ వేశారట. పోలీస్ పెద్దలతో కలిసి ఈ తతంగం నడిపించాడట ఆ దొరగారు. దీంతో  రాత్రికి రాత్రే కొత్త సీన్ క్రియేట్ అయిందట.  భూములపై వివాదం ఉందంటూ సదరు బిజినెస్ మెన్ కొడుకును తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారట. తన కొడుకును పోలీసులు తీసుకెళ్లడంతో ఆ వ్యాపారి తనకున్న రాజకీయ పరిచయాలతో అన్ని ప్రయత్నాలు చేశారట. ఖమ్మం జిల్లాకు చెందిన అధికార పార్టీ ముఖ్య నేతలతోనూ చెప్పించారట. ప్రస్తుత ఎంపీ, మాజీ మంత్రి పోలీసుల పెద్దలతో మాట్లాడినా పని కాలేదట.  వ్యాపారి కొడుకును విడిపించేందుకు ఫోన్ చేసిన ప్రజా ప్రతినిధులకు పోలీసు బాస్ ల  నుంచి వచ్చిన ఒకే ఒక్క సమాధానం.. పై నుంచి ఆర్డర్స్ .. మేం ఏం చేయలేం. విషయం గ్రహించిన బాధిత వ్యాపారి.. చివరికి చేసేది లేక బడానేతతో డీల్ కు ఓకే చెప్పాడట.  వాళ్లు చెప్పినట్లే చేసి తన కొడుకును పోలీస్ స్టేషన్ నుంచి అర్దరాత్రి ఇంటికి తీసుకెళ్లాడట.  

 

అర్ధరాత్రి ఆ  బడా రాజకీయ నేత జరిపిన ఈ  డీల్ ఎంతో తెలుసా. అక్షరాల రెండు వందల కోట్ల రూపాయలు. మీరు వింటున్నది నిజమే.. ఆక్కడ రాత్రికి రాత్రే జరిగిన డీల్ తో  200,00,00,000 రూపాయలు ఆ ముఖ్య నేతకు అప్పనంగా వచ్చేశాయట.  బాడా నేత కన్నుబడిన వ్యాపారికి సంబంధించిన భూమి విలువ ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం ఎకరాకు మూడు కోట్ల రూపాయలు ఉందట. అయితే భూములను కాజేయాలనే స్కెచ్ వేసిన సదరు దొరగారు మాత్రం ఎకరాకి 70 లక్షల రూపాయలు మాత్రమే ఇస్తానని మొదట బేరం పెట్టాడట. పోలీసు పెద్దలు, వ్యాపారికి మద్దతుగా నిలిచిన ప్రజా ప్రతినిధుల చొరవతో చివరికి కోటి రూపాయల చొప్పున.. ఈ వ్యాపారికి 3 వందల కోట్లు విదిల్చాడట. కొడుకును విడిపించుకునేందుకు చేసేది లేక 9 వందల  కోట్ల రూపాయల విలువైన భూములను... కేవలం మూడు వందల కోట్లకు ఆ బడా నేతకు అప్పగించి బతుకు జీవుడా అంటూ ఆ వ్యాపారి తన కొడుకును తీసుకుని పోలీస్ చెర నుంచి , ఆ బడా నేత కబంద హస్తాల నుంచి బయటపడ్డాడట.  

 

అత్యంత ఖరీదైన భూములను వ్యాపారి నుంచి అక్రమంగా సొంతం చేసుకున్న ఆ ముఖ్య నేత..  కొన్ని గంటల్లోనే మరో వ్యాపారికి ఆ భూమిని  అమ్మేశాడట. వ్యాపారికి ఎకరాకు కోటి రూపాయలు ముట్టచెప్పిన సదరు నేత..  ఐదు వందల కోట్ల రూపాయలకు ఆ భూమిని విక్రయించాడట.  అంటే సదరు నేత కేవలం కొన్ని గంటల్లోనే అక్షరాల రెండు వందల కోట్ల రూపాయలు నొక్కేశాడటన్న మాట. హైదరాబాద్ లో జరిగిన ఈ భూ దందా బాగోతం కేంద్రం పెద్దలకు కూడా చేరిందని తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలిసిన రాష్ట్ర పెద్దకు ... ఈ డీల్ వివరాలు చూపించి చుక్కలు చూపించారట కేంద్రం పెద్దలు. ఇంతటి అరాచకాలు జరుగుతుంటో ఏం చేస్తున్నారని క్లాస్ పీకారట. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందని కూడా  ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ డీల్ కు సంబంధించిన వివరాలను కేంద్రం పెద్దలు టేబుల్ పై ఉంచి ప్రశ్నించడంతో.. ఆ రాష్ట్ర పెద్ద నేత సమాధానం చెప్పుకోలేక దిక్కులు చూశారని తెలుస్తోంది. 

 

వినడానికే వింతగా, ఏదో మాయ జరిగినట్లుగా అనిపిస్తున్నఈ ఘటన..  హైదరాబాద్ శివారులో  జరుగుతున్న అక్రమ భూదందాకి  సాక్ష్యంగా నిలుస్తోంది. మాములుగా సినిమాల్లో మనం ఇలాంటి సీన్లు చూస్తుంటాం. తనకు నచ్చిన భూమి కనిపిస్తే చాలు విలన్లు కబ్జా చేసేస్తుంటారు. బలవంతంగా తమకు నచ్చిన రేటుకే కొనుగోలు చేస్తుంటారు. భూ యజమానులు వినకపోతే .. అతన్నో, అతని కుటుంబ సభ్యులనే కిడ్నాప్ చేసి ల్యాండ్ డాక్యుమెంట్లపై బలవంతంగా సంతకాలు చేయించుకుంటూ ఉంటారు. పోలీసులతో కుమ్మక్కై సెటిల్ మెంట్లు చేసుకుంటారు.  అయితే అలా జరగడం సినిమాల్లోనే  సాధ్యమనే భావనే జనాల్లో ఉంటుంది. సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్ లోనూ  ఇలాంటి షాకింగ్ ఘటనలు జరుగుతాయని తాజా ఘటనతో  తెలుస్తోంది.  రాజకీయాలతో మంచి సంబంధాలు ఉన్న , ఎన్నికల్లోనూ పోటీ చేసిన వ్యాపారికే దిక్కు లేకుండా ఉంటే ..  మిగితావాళ్ల  పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో ఊహించవచ్చు. గ్రేటర్ హైదరాబాద్ శివారులో జరిగిన ఈ భూ మాయాజాలం  ఘటన ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో కలవరం రేపుతుందని తెలుస్తోంది.