కొడుకులకు రాజకీయ పాఠాలు నేర్పుతున్న లాలూ

బీహార్ ఎన్నికల్లో మహాకూటమి గెలుపొందడంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసింది. జేడీయూ నేత నితీష్ కుమార్ తో జట్టుకట్టి మహాకూటమిని విజయతీరానికి చేర్చడంలో చాలా కృషిచేశారు. అంతేకాదు ఈ విజయంలో భాగంగా తన కొడుకులని రాజకీయ ఆరంగేట్రం చేయించి.. రాజకీయ ఎంట్రీ ఇచ్చిన ఆరంభంలోనే మంత్రుల పదవులు వచ్చేలా చేశారు. అంతేకాదు ఇప్పుడు కొడుకులిద్దరికీ రాజకీయ పాఠాలు నేర్పించడంలో లాలూ పూర్తి సమయం కేటాయించే పనిలో పడ్డట్టు తెలుస్తోంది.

లాలూ ఇద్దరు కొడుకుల్లో పెద్ద కుమారుడు ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టగా.. చిన్న కుమారుడు ఉప ముఖ్యమంత్రిగా మరో రెండు శాఖలను నిర్వహిస్తున్నాడు. దీంతో ఇప్పుడు లాలూ వీరిద్దరిని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. లాలూనే కాదు కొడుకులు కూడా తండ్రి దగ్గర పాఠాలు నేర్చుకోవడానికి తెగ ఇంట్రస్ట్ చూపిస్తున్నారట. అందుకే మంత్రులుగా.. ప్రభుత్వం వారికి కట్టబెట్టే బంగ్లాలను సైతం కాదని లాలూ ఇంటి దగ్గరే ఉండి రాజకీయ ఓనమాలు నేర్చుకుంటున్నారు. దీనిలో భాగంగా ఇక లాలూ కూడా అధికారులను సైతం తనదైన శైలిలో మార్పులు చేయిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో తన హయాంలో నమ్మకస్తులుగా పనిచేసిన ఐఏఎస్ అధికారులను మళ్లీ ఇప్పుడు తీసుకుంటున్నారు. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న అరుణ్ కుమార్ ని బదిలీ చేయించి తమకు అనుకూలంగా ఉండే సుధీర్ కుమార్ ను ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారు. ఆరోగ్యశాఖను నిర్వహిస్తున్న తేజ్ ప్రతాప్ కు పాలనలో ఇబ్బందులు తలెత్తకుండా ఆర్.కె మహాజన్ ను ఆ శాఖకు బదిలీ చేయించుకున్నారు. మొత్తానికి లాలూ తన కొడుకుల రాజకీయ భవిష్యత్ గురించి మంచి శ్రద్ధ తీసుకుంటున్నట్టే కనిపిస్తుంది. మరి లాలూ రాజకీయాల్లో నెగ్గినట్టు ఇద్దరు కొడుకులు రాణిస్తారో లేదో చూడాలి.