ఢిల్లీ ఎయిమ్స్ పై లాలూ ఫైర్.. బలవంతంగా పంపించారు...
Published on: Mon Apr 30, 2018 5:07PM

దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. అయితే అక్కడ ఆయన అనారోగ్యానికి గురవ్వడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న సంగతి కూడా విదితమే. ఈ నేపథ్యంలో ఆయన్ని ఈరోజు ఎయిమ్స్ వైద్యులు డిశ్చార్జ్ చేశారు. దీంతో, ఆయన ఆసుపత్రి నుంచి రాంచీ ఆసుపత్రికి బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనకు చికిత్స పూర్తి కాకుండానే బలవంతంగా పంపించారని మండిపడ్డారు. తన ఆరోగ్యాన్ని క్షీణింపజేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని.. ఎలాంటి వైద్య సౌకర్యాలు లేని చోటుకు తనను బలవంతంగా తరలిస్తున్నారని విమర్శించారు. ఇది చాలా గడ్డు సమయమని... అయినా, తాను ధైర్యంగా ఎదుర్కొంటానని అన్నారు.
మరోవైపు, లాలూ ఆరోగ్యం మెరుగుపడిందని, ప్రయాణం చేసే శక్తి ఆయనకు ఉందని ఎయిమ్స్ వైద్యులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆయనను రాంచీలోని రాంచీ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి రెఫర్ చేస్తున్నామని చెప్పారు. మెడికల్ బోర్డు సలహా మేరకు ఆయనను డిశ్చార్జ్ చేశామని తెలిపారు.


