ఏపీ ప్రజలకు త్వరలో విముక్తి.. జగన్ సీఎం కావడం ఖాయం
Published on: Fri May 10, 2019 1:14PM

వైసీపీ నేత లక్ష్మీపార్వతి ఏపీ సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆమె అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. త్వరలోనే చంద్రబాబు అరాచక పాలన అంతమవుతుందని అన్నారు. రాష్ట్రంలో మళ్లీ రాజన్న రాజ్యం రావాలంటే వైఎస్ జగన్ సీఎం కావాలన్నారు. టీడీపీ ప్రభుత్వ పాలనలో ఎన్నో దారుణాలు చోటు చేసుకున్నాయంటూ విమర్శించారు.
'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రాన్ని ఏపీలో విడుదల కాకుండా అడ్డుకున్నారంటూ మండిపడ్డారు. చివరికి మహిళనని కూడా చూడకుండా తనపై చాలా దారుణంగా ప్రవర్తించారని చెప్పుకొచ్చారు. చంద్రబాబువి మొదట్నుంచి అడ్డదారి రాజకీయాలేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాంటి పాపాల భైరవుని పాపం పండే రోజులు దగ్గరపడ్డాయన్నారు. దోపిడీ పరిపాలన నుంచి రాష్ట్ర ప్రజలకు త్వరలోనే విముక్తి రానుందని లక్ష్మీపార్వతి జోస్యం చెప్పారు. ఈ నెల 23న రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాత్మక మార్పు రానుందని, తమ పార్టీ గెలిచి జగన్ సీఎం కావడం ఖాయమని లక్ష్మీపార్వతి అన్నారు.


