రాజ్యసభకు లక్ష్మణ్.. ముషీరాబాద్ నుంచి పోటీకి దత్తన్న కుమార్తెకు లైన్ క్లియర్
Published on: Thu Jun 2, 2022 7:39AM
తెలంగాణ ఎన్నికలను సీరియస్ గా తీసుకున్న బీజేపీ ఇప్పటి నుంచే అభ్యర్థుల ఎంపిక కసరత్తు ప్రారంభించేసింది. ఈ సారి ఎలాగైనా తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీ అందుకు అనుగుణంగా రాష్ట్రంలో దూకుడు పెంచింది. ఒక వైపు అధికార టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలనూ, ప్రజా వ్యతిరేక చర్యలనూ ఎండగడుతూనే, ప్రజా సమస్యలపై పోరాటాలక సమాయత్తమౌతోంది. మరో వైపు అసెంబ్లీ ఎన్నికలలో కీలక స్థానాలలో అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టింది. ముషీరాబాద్ మాజీ ఎమ్మెల్యే లక్ష్మణ్ ను రాజ్యసభకు పంపడం ద్వారా ఈ టికెట్ ఆశిస్తున్న బీజేపీ సీనియర్ నేత, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమర్తె విజయలక్ష్మికి లైన్ క్లియర్ చేసింది. ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఏడు సార్లు పోటీ చేసిన లక్ష్మణ్ ను రాజ్యసభకు పంపడం ద్వారా విజయలక్ష్మికి లైన్ క్లియర్ చేయడమే కాకుండా బీసీలకు అగ్రతాంబూలమించ్చామ చెప్పుకునే అవకాశం ఉంటుందని బీజేపీ వర్గాలు అంటున్నాయి.
లక్ష్మణ్ ను రాజ్యసభకు ఎంపిక చేయకపోయినట్లైతే ముషీరాబాద్ లో ఆయననే పోటీకి దింపాల్సి వచ్చేది. అయితే ఇక్కడే బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించి లక్ష్మణ్ ను యూపీ నుంచి పెద్దల సభకు పంపేందుకు నిర్ణయించుకోవడంతో ముషీరాబాద్ లో విజయ లక్ష్మి పోటీకి లైన్ క్లియర్ అయ్యింది.
ఇలా ఉండగా లక్ష్మణ్ ను రాజ్యసభకు ఎంపిక చేయడంలో బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చక్రం తిప్పారని అంటున్నారు. లక్ష్మణ్ పోటీలో లేకుంటే తన కుమార్తెకు ముషీరాబాద్ టికెట్ ఖరారౌతుందని దత్తన్న యోచిస్తే.. రాష్ట్ర రాజకీయాలలో లక్ష్మణ్ ప్రమేయాన్ని తగ్గిస్తే తనకు తిరుగుండదని కిషన్ రెడ్డి భావించారు. దాంతో ఇరువురూ పార్టీ అధిష్టానాన్ని ఒప్పించి లక్ష్మణ్ ను రాజ్యసభకు ఎంపిక చేయించారని పార్టీ వర్గాలే అంటున్నాయి.


