ఇప్పటివరకు ఇసుక... ఇప్పుడు ఈ-కేవైసీ... ఏపీ ప్రజలకు కొత్త కష్టాలు.!

 

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలకు కొత్త కష్టాలు మొదలయ్యాయి. ఇసుకపై ఆంక్షలతో ఇప్పటికే నిర్మాణరంగం కుదేలై లక్షలాది మంది కార్మికులు రోడ్డునపడగా, మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టుగా, పేదలకు ఇప్పుడు మరో కష్టం వచ్చిపడింది. సెప్టెంబర్ నుంచి ఇంటికే రేషన్ సరుకులు సప్లై చేస్తామని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించడంతో, అందుకు తగ్గట్టుగా పౌరసరఫరాలశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, రేషన్ కార్డుల్లో అవకతవకలను సరిజేయడానికి, అలాగే నకిలీ కార్డులను ఏరిపారేయడానికి ఈ-కేవైసీ చేయించుకోవాలని అధికారులు ఆదేశాలిచ్చారట. అంతేకాదు ఈ-కేవైసీ చేయించుకోకపోతే.... రేషన్‌ సరుకులతోపాటు ప్రభుత్వ పథకాలు నిలిచిపోతాయంటూ ప్రచారం జరుగుతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. రేషన్ కార్డులో పేర్లు ఉన్నవారంతా తప్పనిసరిగా ఈ-కేవైసీ చేయించుకోవాలని, లేదంటే సరుకులు ఇచ్చే పరిస్థితి ఉండదని రేషన్ డీలర్లు చెబుతుండటంతో పిల్లాపాపలతో కలిసి అటు రేషన్ డిపోలకు... ఇటు ఆధార్ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు జనం.

అయితే, చంద్రబాబు హయాంలో, కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు వేలిముద్ర వేస్తే చాలు రేషన్ సరకులు ఇచ్చేవారు. అయితే, ఇప్పుడు జగన్ ప్రభుత్వం... ఇంటికే సప్లై చేస్తామని చెప్పడంతో, ఈ-కేవైసీ చేయించుకోని జాబితాను రేషన్ డీలర్లకు పంపిన సివిల్ సప్లై అధికారులు... వేలిముద్రలు తీసుకోవాలని ఆదేశించారట. అయితే, ఈ-కేవైసీ చేయించుకోని వాళ్ల సంఖ్య... ప్రతి మండలంలోనూ 15వేలకుపైగానే ఉండటం... మరోవైపు, ఈ-పోస్ మెషీన్లు మొరాయిస్తుండటంతో ఈ-కేవైసీ ముందుకుసాగడం లేదనే మాట వినిపిస్తోంది.

ప్రతి మండలంలోనూ ఈ-కేవైసీ చేయించుకోనివారి సంఖ్య వేలల్లో ఉండటంతో ఇది ఎప్పుడు పూర్తవుతుందనే ప్రశ్నార్ధకంగా మారింది. మరోవైపు, సివిల్ సప్లై అధికారుల హెచ్చరికలతో రేషన్ కార్డుదారులు తమ పనులు మానుకునిమరీ రోజుల తరబడి రేషన్ డిపోల ముందు పడిగాపులు పడుతున్నారు. మరి అనుకున్నట్లుగా సెప్టెంబర్ నుంచే గడపగడపకూ రేషన్ సరకులు సప్లై చేస్తారా? లేక ఈ-కేవైసీ పూర్తికాలేదని వాయిదా వేస్తారో చూడాలి.