చిదంబర హస్తం!

 

 

 

తనకి ఎదురు తిరిగి తోకలు జాడించిన వాళ్ళ తోకలు కట్ చేసి సున్నం రాయడం అనేది కాంగ్రెస్ పార్టీ సంస్కృతి. అలాంటి కాంగ్రెస్ పార్టీ తనను తీవ్రంగా వ్యతిరేకించిన కొంతమంది విషయంలో మాత్రం తన ఒరిజినల్ పద్ధతిని ఫాలో అవడం లేదు. అలాంటి కొంతమందిలో మొదటి వరుసలో వుండే వ్యక్తి అందరూ ముద్దుగా ‘సర్వేపాటి’ అని పిలుచుకునే లగడపాటి! మొన్నటి వరకూ సమైక్యం అని గొంతు చించుకున్న లగడపాటి ఇప్పుడు గొంతు నొప్పి పుట్టకుండా సమైక్య రాగం కూనిరాగంలా ఆలాపిస్తున్నారు. ఆయన రాష్ట్ర విభజనకు పరోక్షంగా సహకరిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

 

లగడపాటి కూల్‌గా కూనిరాగం ఆలపించడం, కాంగ్రెస్ అధిష్టానం ఆయన మీద ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం...  ఈ రెండిటి వెనుక ‘చిదంబర హస్తం’ వుందని అంటున్నారు. దీని వెనుక వున్న చిదంబర రహస్యమేమిటో రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రాన్ని కేక్ కోసినట్టు ఈజీగా ముక్కలు చేసేయాలంటే కాంగ్రెస్ అధిష్టానానికి లగడపాటి అవసరం వుంటుంది. అలాగే లగడపాటి ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడాలంటే కాంగ్రెస్ ఆశీస్సుల అవసరం వుంది. అందువల్ల ఈ ఇద్దరూ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఒక అండర్‌స్టాండింగ్ వచ్చినట్టు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.



లగడపాటి రాష్ట్ర విభజనకు సహకరించాలి. కాంగ్రెస్ అధిష్టానం లగడపాటిని క్షమించేసి ఆయనకున్న ఆర్థిక ఇబ్బందులను తొలగించాలి. లగడపాటికి మిత్రుడైన కేంద్రమంత్రి చిదంబరం ఈ ఒప్పందం కుదరడానికి కృషి చేసినట్టు తెలుస్తోంది. లగడపాటికి చెందిన సంస్థలు చెల్లించాల్సిన అప్పుల చెల్లింపు విషయంలో గడువు పెంచడం, కొన్ని రుణాలను రీ షెడ్యూలు చేయించడం, కొత్త అప్పులు వచ్చేలా చేయడం లాంటి ఉపకారాలు ఆల్రెడీ జరిగిపోయాయని తెలుస్తోంది.



ఈ విషయంలో చిదంబరం కేంద్ర ఫైనాన్స్ సెక్రటరీ మీద వత్తిడి తెచ్చినట్టు సమాచారం. అప్పుల విషయంలో వత్తిడి తగ్గిపోవడంతో ఊపిరి పీల్చుకున్న లగడపాటి ప్రస్తుతం రాష్ట్ర విభజన కార్యక్రమం సజావుగా సాగిపోవడానికి తనవంతు సహకారాన్ని అందిస్తున్నారని, విభజనకు వ్యతిరేకమని అంటూనే విభజనకు సహరిస్తున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ‘సొంతలాభం కొంత చూసుకుని తెలుగు వెన్నుకు పోటు పొడువోయ్’ అనే మాటకు నిఖార్సయిన నిదర్శనంగా లగడపాటి నిలుస్తాడని అంటున్నారు.