TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

లగడపాటి వ్యూహం ఏమిటి?

Published on: Thu Feb 16, 2012 2:24PM

విజయవాడ:విజయవాడ పార్లమెంట్ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ సంచలన నిర్ణయాలకు మారుపేరుగా నిలిచారు. ఆయన ఏం చేసినా దూరదృష్టితోనే చేస్తారు. సమైఖ్యవాదాన్ని భుజాన వేసుకున్నా, విజయవాడ నుంచి నిమ్స్ కు పారిపోయినా, జాతీయ పతాక స్ఫూర్తితో మారధాన్ రన్ నిర్వహించినా ఇలా ఏది చేసినా ఒక సంచలనమే. ఇటివల ఆయన లోక్ సభలో విశాఖస్టీల్ ఉద్యోగుల సమస్యలను ప్రస్తావించడం, ఆ నగర వివాదాస్పద మున్సిపల్ కమీషనర్ తో కలిసి సైకిల్ తొక్కడంతో ఆయన వచ్చేసారి లోక్ సభ ఎన్నికల్లో విశాఖనుంచి పోటీచేస్తారనే ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. దీనికి కారణం కూడా ఉంది. 2004 లో తొలిసారిగా విజయవాడ నుంచి పోటీచేసిన రాజగోపాల్ సుమారు లక్ష పైచిలుకు ఓట్లతో టిడిపి అభ్యర్ధి అశ్వనీదత్ పై గెలిచారు. అయితే 2009లో జరిగిన ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధి వంశీపై గెలుపొందినప్పటికీ మెజారిటీ దారుణంగా 12వేలకు పడిపోయింది. దీనికి ప్రధాన కారణం రాజగోపాల్ పనితీరే. ఆయన విజయవాడ లోక్ సభ నియోజకవర్గ అభివృద్ధికి పెద్దగా చేసింది లేదనే ఆరోపణలున్నాయి. మెజారిటీ తగ్గిపోవడంతో రెండుసార్లు ఓకేస్థానం నుంచి గెలుపొందిన రాజగోపాల్ విజయవాడ సెంటిమెంట్ ను దృష్టిలో పెట్టుకుని మూడోసారి ఈ నియోజకవర్గం నుంచి పోటీచేయరనే ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారంలో నిజంలేడని, తాను మళ్ళీ విజయవాడనుంచే పోటీచేస్తానని రాజగోపాల్ ఇటీవల స్పష్టం చేశారు. రాజగోపాల్ హైదరాబాద్ లో కాపురం ఉన్నప్పటికీ ఢిల్లీ, హైదరాబాద్, విజయవాడల మధ్య తరచు ప్రయాణిస్తుంటారు. తనపై వచ్చే విమర్శలకు తాను పెద్దగా పట్టించుకోనని ఆయన అంటారు. అయితే దుర్గగుడి వద్ద ప్లైఓవర్ విషయంలో ఎంపి రాజగోపాల్ విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఔటర్ రింగురోడ్డుతో ప్లైఓవర్ ను అనవసరంగా కలుపుతున్నారనే విమర్శలు ఆయనపై ఉన్నాయి. ఆర్కిటెక్చర్ కళాశాలకు స్థలం చూపించే విషయంలో రాజగోపాల్ చొరవ చూపించలేదనే అపవాదు మూటగట్టుకున్నారు. దీనికి తోడు కాంగ్రెస్ లోని ద్వితీయ, తృతీయశ్రేణి నాయకుల్లో అత్యధికులు వైయస్సార్ కాంగ్రెస్ కు తరలిపోయారు. దీంతో నగరంలో ఆయనకు కార్యకర్తల బలం బాగా సన్నగిల్లిపోయింది. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ  ఆయన మళ్ళీ విజయవాడ నుంచే పోటీచేస్తానంటూ మరో సంచలన ప్రకటన చేశారు.