TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బాబుగారు నో టెన్షన్... లగడపాటి భరోసా...

Published on: Sat Jan 27, 2018 12:33PM

 

ఒకపక్క మన తెలుగు రాష్ట్రాల్లోనే నాయకులు సర్వేలు చేస్తూ తమ పార్టీ పరిస్థితి ఎలా ఉంది అని ఎప్పటికప్పుడు తెలుసుకునే పరిస్థితి ఏర్పడింది. ఒక్కోసారి సర్వేలు తమకు అనుకూలంగా వచ్చినా... ఒక్కోసారి మాత్రం షాకులిస్తూనే ఉంటాయి. ఇక ఈ సర్వేలకు తోడు ఈ మధ్య జాతీయ మీడియాలు కూడా సర్వేలు మొదలుపెట్టాయి. తెలంగాణ సంగతేమో కానీ.. ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే... వైకాపాకు ఎక్కువ సీట్లు వస్తాయని రిపబ్లిక్ టీవి  చెప్పుకొచ్చింది.

 

ఇక ఈ సర్వే ఫలితాలు విన్నవాళ్లు ఒక్కసారిగా షాక్ గురైనంత పనైంది. ఎందుకంటే ఏపీలో వైసీపీ పరిస్థితి ఏంటో తెలుసు. ఒకపక్క వైసీపీ ఎన్నికల వ్యూహకర్త సర్వేలు చేస్తూ జగన్ కు షాకిస్తూనే ఉన్నాడు. అలాంటిది..  ఉన్నఫళంగా వైకాపా ఎలా బలపడిందో ఎవరికీ అంతు చిక్కని ప్రశ్న. మరోవైపు కొంతమంది అయితే ఆ సర్వేచూసి నవ్వుకుంటున్నారు కూడా. ఇక ఇప్పుడు తాజాగా ఈ సర్వేలపై లగడపాటి రాజగోపాల్ కూడా స్పందించారు. అసలే ఇలాంటి సర్వేలకు లగడపాటి పెట్టింది పేరు. ఆయన చెప్పిన సర్వేలు దాదాపు నిజమయ్యాయి కూడా అందుకే ఏకంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సర్వేలపై లగడపాటిని అడిగారట.

 

దీంతో ఈ సర్వేలను అస్సలు పట్టించుకోవక్కర్లేదని లగడపాటి చంద్రబాబుకి భరోసా ఇచ్చారట.  అంతేకాదు...ఇప్పటికిప్పుడు జరిగితే 2014 కంటే గణనీయమైన స్థానాలు టీడీపీ గెలుచుకుంటుందని చెప్పారట. దానికి కారణం 2014 కంటే రాయలసీమలో టీడీపీ బలపడటమే. అయితే ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో మాత్రం ఇప్పటికి బలహీనంగానే ఉందని.. అదే విధంగా కాపు ఉద్యమం ఎలా ఉన్న గోదావరి జిల్లాలలో టీడీపీ తన పట్టును నిలబెట్టుకోనుందని చెప్పారట. ఇక పొత్తులు విషయానికి వస్తే బీజేపీతో కలిసి వెళ్లకపోతే ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం ఉందని... మరోవైపు జనసేన విషయానికి వస్తే పొత్తు ఉంటే టీడీపీకి ఉపయోగపడే అవకాశం ఉందని చెప్పారట. అంతేకాదు..జనసేన సొంతంగా గెలిచే అవకాశం పెద్దగా లేకపోయినా కొన్ని చోట్ల గణనీయమైన ఓట్లు రాబడుతుందని లగడపాటి చెప్పారట. మొత్తానికి జాతీయ మీడియా సర్వే చంద్రబాబును భయపెట్టినట్టుంది. మరి లగడపాటి ఇచ్చిన భరోసాతో బాబు కాస్త నెమ్మదించి ఉంటారు...