వైకాపాపై లగడపాటి విమర్శలు

 

ఈ రోజు తమ రాజీనామాలను ఆమోదింపజేసుకోనేందుకు లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ ను కలిసిన అనంతరం, విజయవాడ యంపీ లగడపాటి రాజగోపాల్ మీడియాతో మాట్లాడుతూ “మేము ముందు నుండి చెపుతున్నట్లే మా మాటకు కట్టుబడి ఈ రోజు మా రాజీనామాలను ఆమోదింపజేసుకోవడానికి స్పీకర్ ను కలిశాము. కొంతమంది వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గినా, మిగిన ముగ్గురం మాత్రం రాజినామాలకే కట్టుబడ్డామని స్పష్టం చేసాము. అయితే నిన్నటి వరకు మాతో ఉన్న ఒక యంపీ (యస్పీ.వై. రెడ్డి) అకస్మాత్తుగా వేరే పార్టీ(వైకాపా)లోకి మారిపోవడం చాలా ఆశ్చర్యం కలిగించింది."

 

"సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్నామని చెప్పుకొంటున్న ఆ పార్టీ, ఈ పరిస్థితుల్లో కూడా ఈవిధంగా ఇతర పార్టీల నేతలకు గాలం వేస్తుండటం చూస్తే ఆ పార్టీ ఎటువంటి రాజకీయాలు చేస్తోందో అర్ధం అవుతుంది. తెలంగాణా బిల్లు శాసనసభకు వచ్చినప్పుడు, పార్టీలకు అతీతంగా సీమాంద్రాకు చెందిన శాసన సభ్యులందరూ వ్యతిరేఖంగా ఓటేసి ఓడించాల్సిన తరుణంలో, ఆ పార్టీ శాసన సభ్యులు రాజీనామాలకు పూనుకోవడం, సమైక్యవాదం గట్టిగా వినిపిస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్నికూల్చే ప్రయత్నాలు చేయడం చూస్తే, ఆ పార్టీ అసలు రాష్ట్రం కలిసి ఉండాలని పోరాడుతోందా లేక విడిపోవాలని పోరాడుతోందో అర్ధం అవుతుంది."

 

"సమైక్యవాదం వినిపిస్తున్న కిరణ్ కుమార్ రెడ్డిని తెలంగాణావాదులు విమర్శించడం, ఆయనని తొలగించాలని కోరడం సహజమే అనుకొన్నా, వైకాపా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలాగయినా కూల్చివేసి రాష్ట్రపతి పాలన తీసుకువచ్చి, రాష్ట్ర విభజన ప్రక్రియకు మార్గం సుగమం చేయాలనుకోవడం చూస్తే, ఆ పార్టీ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం ఎంతకయినా దిగజారుతుందని అర్ధం అవుతోంది. కానీ, సమైక్యవాదం గట్టిగా వినిపిస్తున్నకిరణ్ కుమార్ రెడ్డికి మేమందరమూ అండగా నిలబడి ప్రభుత్వం పడిపోకుండా కాపాడుకొంటాము. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు మేము చేయగలిగిన అన్ని ప్రయత్నాలు చేస్తాము,” అని తెలిపారు.