క్లాస్ రూమ్ లో టీచర్ పై కత్తితో అటాక్

నాగలక్ష్మి. గవర్నమెంట్ టీచర్. ఎప్పటిలానే క్లాస్ రూమ్ లో పిల్లలకు పాఠాలు చెబుతోంది. అంతలోనే రామదుర్గాప్రసాద్ కత్తితో క్లాస్ రూమ్ లోకి వచ్చాడు. వస్తూ వస్తూనే టీచర్ పై చాకుతో దాడి చేశాడు. విచక్షణా రహితంగా పొడిచాడు. అకస్మాత్తుగా జరిగిన ఈ దాడితో పిల్లలు హడలిపోయారు. భయంతో పెద్దగా అరిచారు. ఆ అరుపులు విన్న స్థానికులు పరుగెత్తుకుంటూ వచ్చారు. కత్తితో దాడి చేస్తున్న రామదుర్గాప్రసాద్ ను అడ్డుకున్నారు. తీవ్ర గాయాలతో ఉన్న నాగలక్ష్మిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఎంట్రీతో అసలు విషయం వెలుగు చూసింది. టీచర్ నాగలక్ష్మిపై కత్తితో దాడి చేసిన రామదుర్గాప్రసాద్ మరెవరో కాదు ఆమె భర్తే. 

అవును, భర్తే ఈ ఘాతుకానికి తెగబడ్డాడు. పిల్లలకు పాఠాలు చెబుతున్న భార్యను తరగతి గదిలో కత్తితో పొడిచాడు. పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం కాకిలేరు మండల ప్రజాపరిషత్‌ ప్రత్యేక పాఠశాలలో ఈ ఘటన జరిగింది. ఇరగవరం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన గుత్తుల నాగలక్ష్మికి.. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామానికి చెందిన కడలి రామదుర్గాప్రసాద్‌తో 2016లో పెళ్లైంది. వీరికి మూడేళ్ల కుమార్తె ఉంది. రామదుర్గాప్రసాద్‌ కిరాణా వ్యాపారం చేస్తుంటాడు. నాగలక్ష్మి కాకిలేరు ప్రాథమిక పాఠశాలలో టీచర్. భార్య, భర్తల మధ్య గొడవలతో నాలుగు నెలల నుంచి దూరంగా ఉంటున్నారు. భర్త వేధింపులపై గతంలో నాగలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేయగా అతనిపై కేసు కూడా నమోదైంది. నాగలక్ష్మి నుంచి ఏటీఎం కార్డు తీసుకుని జీతమంతా భర్తే వాడుకునేవాడు. పైగా ఆమెతో తరుచూ గొడవ పడుతూ చంపేస్తానని బెదిరించేవాడు. దీంతో భయపడి ఇటీవలే బదిలీపై కాకిలేరు స్కూల్ కు వచ్చింది నాగలక్ష్మి. అయినా.. ఆమెను వదలకుండా.. నాగలక్ష్మి పని చేసే పాఠశాలకు వచ్చి కత్తితో దాడి చేశాడు. ఆమెను చంపడానికి ప్రయత్నించాడు. తీవ్ర గాయాలైన నాగలక్ష్మిని మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. ఉన్మాదిగా మారిన భర్త రామదుర్గాప్రసాద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిని కఠినంగా శిక్షించాలని నాగలక్ష్మి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.