ట్రయల్‌రూంలో యువతి డ్రెస్ ఛేంజ్.. వీడియో తీసిన యువకులు.. మేనేజర్ అరెస్ట్
Published on: Fri Nov 5, 2021 3:32PM
షాపింగ్ మాల్స్‌కి వెళ్లాలంటేనే భయపడాల్సి వస్తోంది. రెస్టారెంట్స్ సైతం కలవరపెడుతున్నాయి. రెస్ట్ రూమ్స్‌కి వెళ్లాలన్నా.. ట్రయల్ రూమ్‌లో బట్టలు మార్చుకోవాలన్నా.. ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి. హైదరాబాద్‌లో ఆవారాగాళ్లు ఎక్కువవుతున్నారు. ఇటీవల ఓ ప్రముఖ రెస్టారెంట్ రెస్ట్ రూమ్‌లో సెల్‌ఫోన్‌తో సీక్రెట్‌గా వీడియో తీయగా.. తాజాగా ఓ షాపింగ్ మాల్ ట్రయల్‌రూంలోనూ దాదాపు అదే సీన్. యువతి డ్రెస్ ఛేంజ్ చేసుకుంటుండగా ఇద్దరు పోకిరీలు వీడియో తీసిన ఘటన కలకలం రేపుతోంది. ఖరీదైన జూబ్లీహిల్స్ ఏరియాలోనే ఈ రెండు ఘటనలు జరగడం కాకతాళీయమో.. లేక...?
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని హెచ్ అండ్ ఎం షాపింగ్‌మాల్ ట్రయల్‌రూంలో యువతి దుస్తులు మార్చుకుంటుండగా ఇద్దరు యువకులు వీడియో తీశారు. గమనించిన యువతి కేకలు వేయడంతో అక్కడున్నవారు యువకులను పట్టుకున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వగానే వారు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల నుంచి సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకొని.. అందులో నుంచి ఆ వీడియో డిలీట్ చేయించారు. ఫోన్‌లో ఇంకా ఇలాంటి వీడియోలు ఏమైనా ఉన్నాయా అనే దిశగా పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ఇద్దరు యువకులతో పాటు స్టోర్ మేనేజర్ ఆమన్‌పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.


