వివేకా గుండెపోటు 'కథ' వెనక 'ఆమె'..?
Published on: Fri Feb 25, 2022 5:22PM
మాజీ ఎంపీ వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్నా.. చిక్కు ముడులు ఇప్పట్లో వీడేలా లేవు. ఈ హత్య కేసులో రోజుకో కొత్త అంశం తెరపైకి వస్తోంది. వివేకా హత్య కేసులో తొలుత ఆయనది గుండెపోటు అంటూ ప్రచారం జరిగింది. గుండెపోటు కథ నుంచి.. గొడ్డలి పోటుతో దారుణ హత్య అనే విషయం ప్రపంచానికి తెలిసే వరకు.. అంతా ఆమెనే కథ నడిచినట్లు కడప జిల్లాలో ఆఫ్ ది రికార్డ్ చర్చ జరుగుతోంది. వివేకా మర్డర్ జరిగిన వెంటనే.. స్థానిక ఎంపీ.. ఆమెకు ఫోన్ చేయడం.. ఆమె వెంటనే స్పందించడం.. ఆమె ఆదేశానుసారంతోనే.. గొడ్డలి పోటు కాస్తా.. గుండెపోటుగా మారిందని... అలాగే ఆమె కనుసన్నల్లో వివేకా హత్య కేసులో సాక్ష్యాలు సైతం తారుమారు అయ్యాయని.. ఇవన్నీ కూడా అటు ఆమె ఫోన్‌లోనే ఆదేశాలు ఇవ్వడం.. ఇటు చక చకా జరిగిపోవడం.. అంతా సెకన్లలో జరిగిపోయిందనే టాక్ అయితే కడప గడప సాక్షిగా వైరల్ అవుతోంది. అంతేకాదు... ఈ హత్య కేసులో కర్మ , కర్త, క్రియా అన్ని ఆమెనని తెలుస్తోంది. అసలీ జగన్నాటకంలో జగన్నాటాక సూత్రధారి అంతా ఆమెదేననే టాక్ అయితే జోరుగా నడుస్తోంది.
ఈ సూత్రధారిణి మంత్రాంగంలో పాత్రధారులు స్థానిక ఎంపీతోపాటు..పలువురు వ్యక్తులు కీలకంగా వ్యవహరించారనే చర్చ కూడా కడప జిల్లా సాక్షిగా సాగుతోంది. అంతేకాదు.. వివేక హత్యతో ఆయన ఎపిసోడ్ పూర్తయిందని ఓ క్లారిటీకి వచ్చిన తర్వాతే.. ఆమె.. ఓ ఎలక్ట్రానికి మీడియా సంస్థలోని సంపాదకీయ వర్గానికి నేరుగా ఫొన్ చేసి.. వైయస్ వివేకా గుండె పోటుతో మరణించారంటూ వార్తలు ప్రసారం చేయాలని ఆదేశించినట్లు చర్చ అయితే కడపలో నడుస్తోంది.
అంతేకాదు అసలు ఆమె ప్రోద్భలంతోనే వైయస్ వివేకానందరెడ్డి హత్య జరిగిందా? అంటూ కడప జిల్లా వాసులు సైతం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ హత్యకు స్కెచ్ వేసిందీ కూడా ఆమెనా? అనే సందేహాలు సైతం వెలువడుతున్నాయి. ఇంతకీ ఆమె ఎవరంటూ ప్రశ్నలు రాష్ట్రవ్యాప్తంగా ఉత్పన్నమవుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
2019, మార్చి 15న వైయస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. కానీ ఆయన గుండె పోటుతో మరణించారంటూ.. ఓ ఎలక్ట్రానిక్ మీడియాలో జోరుగా ప్రచారం అయితే జరిగింది. కానీ ఆ తర్వాత వైయస్ వివేకాది ఆకస్మిక మృతి కాదు.. దారుణ హత్య అంటూ వార్తలు వెలువడ్డాయి. ఆ తర్వాత ఈ కేసు దర్యాప్తు నత్తనడకన సాగుతోండంతో.. వైయస్ వివేకా కుమార్తె సునీత.. హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ హత్య కేసును సీబీఐకు హైకోర్టు అప్పగించింది.
ఈ నేపథ్యంలో ఈ కేసులో అసలు దోషులు ఎవరో సాధ్యమైనంత త్వరగా తేలిపోతారంటూ.. ప్రజలు ఎంతో నమ్మకంతో ఉన్నారు. కానీ ఈ హత్య కేసులో దర్యాప్తులో అనేక ట్విస్టులు చోటు చేసుకున్నాయి. ఒకానొక సమయంలో వివేకా హత్య కేసు దర్యాప్తును సీబీఐ ఆపివేసిందనే చర్చ కూడా సోషల్ మీడియా సాక్షిగా నడిచింది. కానీ ఆ తర్వాత మళ్లీ.. సీబీఐ.. తన దర్యాప్తును వేగవంతం చేసింది. అయితే ఈ హత్య కేసులో వివేకా కారు మాజీ డ్రైవర్ దస్తగిరి.. అప్రూవర్‌గా మారి.. సీబీఐ ఎదుట పూసగుచ్చినట్లు చెప్పేసిన సంగతి తెలిసిందే.
కానీ అసలు ఈ హత్య కేసులో ఆమెది కీలక పాత్ర అంటూ తాజాగా చర్చకు రావడంతో ఇంతకు ఆమె ఎవరంటూ కడప జిల్లా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆమెను కూడా అరెస్ట్ చేస్తేనే... అసలు విషయాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయనే చర్చ సైతం వైయస్ఆర్ కడప జిల్లా సాక్షిగా వైరల్ అవుతోంది. ఇంతకీ అంతా అనుకుంటున్నట్టు.. ఆమె ఆమేనా?


