TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జోరుగా గులాబీ ఆకర్ష్! కారెక్కనున్న కీలక నేతలు...

Published on: Mon Jun 7, 2021 3:23PM

తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామాలు జరుగుతున్నాయి. మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ బర్తరప్ తర్వాత సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. సొంత పార్టీ పెడతారని భావించిన రాజేందర్.. కమలం గూటికి చేరుతున్నారు. ఈటలతో పాటు మరికొందరు నేతలు బీజేపీకి జై కొట్టబోతున్నారు. ఇప్పటికే తెలంగాణలో దూకుడు పెంచిన కమలానికి.. రాజేందర్ రాక మరింత బూస్ట్ ఇస్తోంది. ఇదే స్పీడుతో టీఆర్ఎస్ లోని అసంతృప్త నేతలను, కాంగ్రెస్ లో ఉన్న బలమైన నేతలను తమ పార్టీలోకి తీసుకువచ్చేందుకు బండి సంజయ్ టీమ్ ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది. మాజీ ఎంపీతో పాటు తెలంగాణ కాంగ్రెస్ లో కీలకంగా ఉన్న ఒక ఎమ్మెల్యే త్వరలో కాషాయ జెండా కప్పుకోవడం ఖాయమంటున్నారు.

ఈటల రాజేందర్ కార్యాచరణ, బీజేపీ నేతల కదలికలను గమనిస్తున్న గులాబీ బాస్ కూడా తన వ్యూహాలను పదును పెట్టారని తెలుస్తోంది. బీజేపీ ధీటుగా మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ గా ఆయన తెర లేపారని అంటున్నారు. ఈటల రాజేందర్ ఎపిసోడ్ తో బీసీల నుంచి వ్యతిరేకత రావచ్చని భావిస్తున్న కేసీఆర్.. ఆ సామాజిక వర్గాలను చెందిన నేతలకు గాలం వేస్తున్నారని అంటున్నారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ త్వరలో గులాబీ గూటికి చేరనున్నారని తెలుస్తోంది. రమణకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి పార్టీలోకి చేర్చుకునేందుకు గులాబీ బాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెబుతున్నారు. ఈ మేరకు ఎల్.రమణతో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మంతనాలు సాగించినట్లు సమాచారం. 

జగిత్యాల నియోజకవర్గానికి చెందిన ఎల్ రమణతో.. స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా మాట్లాడారట. పద్మశాలి సామాజికవర్గానికి చెందిన ఎల్‌.రమణకు బీసీ వర్గాల్లో  మంచి గుర్తింపు ఉంది. ఈటల రాజీనామాతో ఖాళీ అయిన బీసీ నాయకుడి స్థానాన్ని మరొక బీసీ నేతతోనే భర్తీ చేయడానికి టీఆర్ఎస్ అధిష్ఠానం వ్యూహ రచన చేస్తోందని తెలుస్తోంది. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేసిన ఎల్.రమణ... రాష్ట్ర విభజన తర్వాత నుంచి టీటీడీపీ అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. ఎల్.రమణతో పాటు పలువురు టీడీపీ నాయకులు టీఆర్ఎస్‌లోకి వెళ్లనున్నారని సమాచారం.ఈ నెల 3న ఎమ్మెల్యే కోటాలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. కోవిడ్ కారణంగా వాటి ఎన్నికల ఆలస్యమవుతున్నాయి.  ఎమ్మెల్సీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా... రమణకు ఛాన్స్ ఖాయమంటున్నారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన బీసీ నేత, టీడీపీ మాజీ నేత ఎర్ర శేఖర్ కూడా త్వరలో కారెక్కనున్నారని తెలుస్తోంది.

ఉత్తర తెలంగాణలో కీలకమైన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పట్టుకోల్పోకుండా ఉండేదుకు టీఆర్ఎస్ అధిష్ఠానం ప్రయత్నాలు మొదలుపెట్టిందని తెలుస్తోంది. ఈటల నియోజకవర్గం హుజూరాబాద్ కు చెందిన మాజీ మంత్రి, టీడీపీలో కీలక నేతగా ఉండి ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఇనగాల పెద్దిరెడ్డిని కూడా కారెక్కించేందుకు రంగం సిద్ధమైందంటున్నారు. పెద్దిరెడ్డితో కేసీఆరే స్వయంగా మాట్లాడుతున్నారని తెలుస్తోంది. ఇటీవలే ఈటల రాజేందర్ బీజేపీలో చేరికపై పెద్దిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈటల బీజేపీలోకి వస్తే ఉప్పెన వస్తుందన్నారు. దీంతో పెద్దిరెడ్డి గులాబీ పార్టీలో చేరడం ఖాయమైందనే చర్చే కరీంనగర్ జిల్లాలో జరుగుతోంది.  

ఎల్ రమణ, పెద్ది రెడ్డితో పాటు గతంలో టీడీపీలో కీలకంగా ఉంటూ ప్రస్తుతం బీజేపీలో ఉన్న నేతలనతోనూ టీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని తెలుస్తోంది. బీజేపీ నేతల తీరుతో అసంతృప్తిగా ఉన్న కొందరు నేతలు.. కేసీఆర్ నుంచి స్పష్టమైన హామీ ఇప్పిస్తే పార్టీలో చేరడానికి సుముఖంగా ఉన్నారని అంటున్నారు. ఈటల రాజేందర్ అధికారికంగా బీజేపీలో చేరిన వెంటనే... గులాబీ పార్టీలోకి వలసలు ఉండేలా వ్యూహం రెడీ చేశారని అంటున్నారు. బీజేపీ దిమ్మతిరిగేలా చేరికల ఉంటాయని కొందరు టీఆర్ఎస్ నేతలు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారంటే.. గులాబీ బాస్ స్కెచ్ భారీగానే ఉందనే చర్చ జరుగుతోంది.