మెట్రోపై లేఖ రాసిన మాట వాస్తవమే... గాడ్గిల్
Published on: Wed Sep 17, 2014 4:37PM

మెట్రోపై తెలంగాణ ప్రభుత్వానికి తమ సంస్థ లేఖ రాసిన మాట వాస్తవమేనని, సెప్టెంబర్ 10వ తేదీన తమ సంస్థ లేఖ రాసిందని ఎల్ అండ్ టీ ఛైర్మన్ గాడ్గిల్ వ్యాఖ్యానించారు. మెట్రో రైలు విషయంలో ఎల్ అండ్ టీ సంస్థ రాసిన లేఖ గురించి మీడియాలో వచ్చిన నేపథ్యంలో ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్‌ని కలిశారు. ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు. మెట్రో ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. మెట్రో పనులు ఎక్కడా ఆగలేదని చెప్పారు. ఒక పెద్ద ప్రాజెక్టు పనులు జరుగుతున్నప్పుడే కాంట్రాక్ట్ సంస్థకు ప్రభుత్వానికి మధ్య లేఖలు సహజమేనని ఆయన అన్నారు. తాము తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసిన మాట వాస్తవమే అయినప్పటికీ, పత్రికల్లో కథనాలు రావడమే దురదృష్టకరమని ఆయన అన్నారు. భారీ ప్రాజెక్టులు అన్న తర్వాత చిన్న చిన్న సమస్యలు రావడం సహజమేనని ఆయన చెప్పారు. తమ సంస్థపై దుష్ప్రచారం జరుగుతోందని, తాము ఏ మీడియా సంస్థకీ లేఖలకు సంబంధించిన సమాచారం ఇవ్వలేదని గాడ్గిల్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో తమకున్న సమస్యలను సున్నితంగా పరిష్కరించుకోవాలన్నది తమ అభిమతమని పేర్కొన్నారు.


