చంద్రబాబుకు కేవీపీ లేఖ.. జగన్ కు దగ్గరవుతున్నారా?

కాంగ్రెస్, టీడీపీ.. ఒకప్పుడు ప్రత్యర్థి పార్టీలేమో కానీ ఇప్పుడు కాదనే చెప్పాలి. ముఖ్యంగా తెలంగాణలో మహాకూటమి పేరుతో ఈ రెండు పార్టీ దగ్గరయ్యాయి. ఇలాంటి సమయంలో ఈ రెండు పార్టీలు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. అంతెందుకు రీసెంట్ గా రాహుల్ గాంధీ కర్నూల్ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా రాహుల్ బహిరంగ సభలో మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై విమర్శలు చేసారు కానీ టీడీపీ మీద చేయలేదు. ఏపీ కాంగ్రెస్ నేతలు కూడా ఇంచుమించు ఇదే ఫాలో అవుతున్నారు. ఏదో చిన్నాచితకా తప్ప టీడీపీ మీద ఘాటైన విమర్శలు చెయ్యట్లేదు. అయితే కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు మాత్రం నా రూటే సెపరేటు అంటున్నారు. హోదా విషయంలో చంద్రబాబు మాటలు మార్చారంటూ ఘాటు లేఖ రాసారు.

 

 

ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలంటూ కాంగ్రెస్ ఎప్పటి నుంచో పోరాటం చేస్తోంది. హోదా కోసం పోరాటం చేయాల్సిన చంద్రబాబు మాత్రం.. అప్పుడు హోదా వద్దు ప్యాకేజీ ముద్దన్నారు. ప్యాకేజీకి ఒప్పుకొని సన్మానాలు కూడా చేయించుకున్నారు. ఇప్పుడేమో హోదా కావాలంటూ అసెంబ్లీలో తీర్మానం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో చంద్రబాబుకు రాష్ట్రం, ప్రత్యేక హోదా గుర్తుకొచ్చింది. ఇప్పుడు ప్రత్యేక హోదాకు తానే ప్రతినిధి అన్నట్లు వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ కూడా మద్దతిస్తుందంటున్నారు. కాంగ్రెస్ పార్టీ మద్దతు కావాలని సీఎం కోరడం సిగ్గుచేటు. కేంద్రం ఎలాగూ హోదాను ఇవ్వడం లేదని తెలిసే, చంద్రబాబు కొత్త డ్రామాలు ఆడుతున్నారు. ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టే చంద్రబాబు కళ్ళకు కమ్ముకున్న అధికార పొరలు కరిగిపోతున్నాయి. ఏపీ ప్రజలకు జరిగిన అన్యాయం గుర్తుకువస్తోందన్నారు. ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ చేసిన పోరాటానికి చంద్రబాబు ఎప్పుడూ మద్దతు ఇవ్వలేదు. పార్లమెంటులో ప్రైవేటు బిల్లుకు కూడా సహకరించలేదు. ఇప్పుడు హోదా పేరుతో చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదాపై తొలి సంతకం పెడతానని రాహుల్ ప్రకటించారు. చిత్తశుద్ధి ఉంటే.. హోదా ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని కేవీపీ అన్నారు.

 

 

అయితే ఇప్పుడు కేవీపీ లేఖ ఏపీలో హాట్ టాపిక్ అయింది. ఓ వైపు తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ దగ్గరవుతున్నాయి. మరోవైపు ఏపీ ప్రత్యేకహోదా విషయంలో రాహుల్ గాంధీ లాంటి నేతలు కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీని విమర్శిస్తున్నారు కానీ.. చంద్రబాబుని విమర్శించట్లేదు. కానీ సీనియర్ నేత కేవీపీ మాత్రం దీనికి భిన్నంగా చంద్రబాబుని విమర్శిస్తున్నారు. అంటే కేవీపీ కాంగ్రెస్ అధిష్టానాన్ని ఫాలో అవ్వట్లేదా? లేక చంద్రబాబుకి దగ్గరవుతున్న కాంగ్రెస్ కి దూరమవుతూ.. జగన్ కి దగ్గరవుతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేవీపీ మొదటి నుండి వైఎస్ కుటుంబానికి సన్నిహితుడు. కాంగ్రెస్ నేతలు కొన్ని సందర్భాల్లో జగన్ ని విమర్శించినా, కేవీపీ మాత్రం విమర్శించారు. కేవీపీ వైసీపీలో చేరతారంటూ గతంలో కూడా వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు ఈ లేఖతో వైసీపీ చేరుతున్నారనే హింట్ ఇచ్చారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి కేవీపీ తెలంగాణ, ఏపీ రాజకీయాలు రెండు వేరనే దృష్టితో లేఖ రాసారో లేక నిజంగానే జగన్ కి దగ్గరవుతున్నట్టు హింట్ ఇచ్చారో? తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. చూద్దాం ఏం జరుగుతుందో.